దిశ కేసులో కీలకంగా సీసీటీవీ విజువల్స్... ఫోరెన్సిక్ రిపోర్టులో సంచలన నిజాలు...

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన హైదరాబాద్ దిశ కేసులో పోలీసుల దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. పోలీసులు అందజేసిన సాక్ష్యాధారాలను విశ్లేషించిన ఫోరెన్సిక్ నిపుణులు మరో రెండ్రోజుల్లో నివేదికను అందజేయనున్నారు. దిశ రేప్ అండ్ మర్డర్ ఘటనలో మొత్తం 40 సాక్ష్యాధారాలను పోలీసులు పరీక్షలకు పంపగా... ఫోరెన్సిక్ నిపుణులు సునిశిత సూక్ష్మ విశ్లేషణ చేశారు. ముఖ్యంగా తొండుపల్లి టోల్‌ప్లాజా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన నిందితుల దృశ్యాలే దిశ కేసులో అత్యంత కీలకంగా మారాయి. నిందితులు దిశలో మాట్లాడటం... దిశను లారీ దగ్గరకు లాక్కెళ్లడంలాంటి దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీల్లో రికార్డయ్యాయి. అయితే, సీసీటీవీ విజువల్స్ అస్పష్టంగా ఉండటంతో... అవి స్పష్టంగా కనిపించేందుకు ఫోరెన్సిక్ నిపుణులు కృషిచేశారు. ముఖ్యంగా మహ్మద్ పాషా, చెన్నకేశవులు, జొల్లు శివ, నవీన్‌లు.... దిశను బలవంతంగా లాక్కెళుతున్న దృశ్యాలను... అత్యాధునిక టెక్నాలజీ వినియోగించి మరింత సృష్టంగా కనిపించేలా డెవలప్ చేశారు. 

అలాగే, తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర్నుంచి దిశ... ఆమె సోదరితో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్స్‌ను విశ్లేషించారు. దిశ తన సోదరితో మాట్లాడుతుండగా నిందితుల వాయిస్ కూడా రికార్డయినట్లు తెలుస్తోంది. అలాగే, సీసీ కెమెరాల్లో నమోదైన నిందితుల వాయిస్‌లను పరీక్షించి... ఆ స్వరాలు వాళ్లవేనని తేల్చారు. అదేవిధంగా, దిశ 15రోజుల కాల్ డేటాను, మొబైల్లో ఉన్న ఫోన్‌ నెంబర్లు, ఎస్‌ఎంఎస్‌లను కూడా విశ్లేషించారు. అంతేకాదు ఘటన జరిగిన రోజు నుంచి అంతకుముందు 15రోజుల వరకు దిశ ఎవరెవరితో మాట్లాడిందో వివరాలు సేకరించి నివేదికలో పొందుపర్చారు. ఇక, దిశ ఘటన జరిగిన రోజు... రాత్రి 9గంటల నుంచి 9-40 వరకు నిందితుల ఫోన్ సిగ్నల్స్ తొండుపల్లి ప్రాంతంలోనే ఉన్నట్లు గుర్తించారు. 

అయితే, దిశ హత్యాచార ఘటనలో అత్యంత కీలకమైన దృశ్యాలు తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గరున్న సీసీ కెమెరాల్లోనే నిక్షిప్తమయ్యాయి. ఇప్పుడా దృశ్యాలే దిశ కేసులో అత్యంత కీలకంగా మారాయి. మరోవైపు, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో వినియోగించిన రివాల్వర్లను, తూటాలను బాలిస్టిక్ నిపుణులు పరిశీలించి రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ నివేదికను న్యాయస్థానానికి సమర్పించనున్నారు. ఒకవైపు పోలీసుల దర్యాప్తు దాదాపు తుది దశకు చేరుకోవడం... మరోవైపు ఫోరెన్సిక్ రిపోర్టు కూడా సిద్ధమవడంతో... త్వరలోనే ఢిల్లీ బృందం హైదరాబాద్ కి రానుంది. దిశ ఘటన జరిగిన నాటి నుంచి నిందితుల ఎన్ కౌంటర్ వరకు నివేదిక రూపొందించి సుప్రీంకోర్టుకు సమర్పించనుంది.