కొడాలి నాని.. స్వామి పాదాల మీద పడి చెంపలు వేసుకోవాలి

 

మంత్రి కొడాలి నానిపై బ్రాహ్మణ సంఘాలు ఫిర్యాదు చేశాయి. విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో వేమూరి ఆనంద సూర్య ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా తిరుమల ఆలయం పై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రులు తమ హోదాలను మరచిపోయి..హుందాతనాన్ని కోల్పోయి.. వాళ్లకి ఏ భాష నోటికి వస్తే ఆ భాషతో ఎదుటి వ్యక్తులనే కాకుండా సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వేంకటేశ్వరస్వామి వారి దేవాలయాన్ని కూడా కించపరిచే రకంగా మాట్లాడుతున్నానరని అన్నారు. దురదృష్టవశాత్తూ వాళ్ళ రాజకీయాలను చూసుకోకుండా సాంప్రదాయాలను ఉల్లంఘించారన్నారు. స్వతహాగా క్రిస్టియన్ గా ఉన్నటువంటి సీఎం జగన్ రెడ్డి గారు ఆయన మతాన్న గౌరవించుకుంటూ ఇతర మతాలను.. సాంప్రదాయాలను.. అగౌరవ పరిచేలా మాట్లాడుతున్న వారికి అండగా ఉంటున్నారని అన్నారు. 

అన్యమతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే ఓ రూల్ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో వారు సంతకం పెట్టాలి. ఆ రూల్ ప్రకారం దేవాలయంలో సంతకం పెట్టకుండా కించపరిచిన అనేక సందర్భాలున్నాయి. అలా ఎందుకు చేస్తున్నారని అడిగినందుకు వారి మంత్రి వర్గ సభ్యుడు శ్రీ కొడాలి నాని గారు ఆ దేవాలయాన్ని ఎవడమ్మ మొగుడు కట్టించాడురా ఈ గుడిని అంటూ  కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. ఆయన భాష తీరుని మార్చుకోవాలి.. ఆయన మాట్లాడిన మాటలకి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాల మీద పడి చెంపలు వేసుకుని యావత్ హిందూ జాతికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వేమూరి ఆనంద సూర్య. కొడాలి నానిపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు కంప్లయింట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న హిందువులు.. బ్రాహ్మణ సంఘాలు.. ఇలా కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావాలని కోరారు. హిందువులు అన్ని మతాలను గౌరవిస్తున్నారు.. మీరెందుకు హిందూ మతాన్ని గౌరవించరని ప్రశ్నించారు. ఇలా మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోవాలని జగన్ ని హెచ్చరించారు.