అమరావతి మహిళలపై పోలీసుల దౌర్జన్యం... లాఠీఛార్జ్‌పై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్‌...

రాజధానిపై ఆందోళనలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు అంటూ రాజధాని రైతులు, మహిళలు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు. దాంతో, అమరావతి గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే, అమరావతి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి రాజధాని మహిళలు తలపెట్టిన పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పాదయాత్రకు అనుమతి లేదంటూ తుళ్లూరులో మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దాంతో, పోలీసులకు వ్యతిరేకంగా మహిళలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అయితే, తాము... ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి వెళ్లడం లేదని... కేవలం దుర్గమ్మను దర్శించుకోవడానికే వెళ్తున్నామంటూ మహిళలు... పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో, కొందరు మహిళలు... పోలీసులను, బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ లాఠీఛార్జ్‌లో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. 

అయితే, అమరావతి మహిళలపై లాఠీఛార్జ్‌ను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. లాఠీఛార్జ్‌ను సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్... పోలీసులకు నోటీసులు పంపింది. అలాగే, తుళ్లూరులో మహిళలపై పోలీస్ చర్యపై నిజనిర్ధారణ కోసం రేపు అమరావతికి కమిటీని పంపుతున్నట్లు ఎన్‌హెచ్‌ఆర్సీ ఛైర్ పర్సన్ రేఖాశర్మ తెలిపారు.