ఫ్రీగా మోడీ స్కూటర్లు...క్యూ కట్టిన లక్షలాది మంది !

 

మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న మోడీ మరో అడుగు ముందుకేసి 10వ తరగతి పాసైన బాలికలకు ఉచితంగా స్కూటీలను అందజేసే పీఎం స్కూటీ యోజనను ప్రారంభించారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పది పాసైన అమ్మాయిలు పై చదువులు చదువుకోవడం కోసం, చిరు ఉద్యోగాలు చేసే మహిళలు పని ప్రదేశాలకు వెళ్లి రావడానికి అనువుగా మోడీ సర్కార్ ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది.

సర్కారీ యోజన వెబ్‌సైట్‌ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని టెన్త్ మెమో, రేషన్ కార్డు, ఆధార్, ఇన్‌కమ్ సర్టిఫికెట్‌‌లతోపాటు ఎల్ఎల్ఆర్ లైసెన్స్ కూడా దరఖాస్తు సమయంలో సమర్పించాలని సర్య్యులేట్ అవుతుండడంతో లక్షలాది మంది మహిళలు అప్లికేషన్ పెట్టుకునేందుకు మీసేవ, నెట్ సెంటర్ ల ముందు క్యూ కట్టారు. అయితే, అటువంటి పథకమేమీ కేంద్రం ప్రకటించలేదని ఈ వార్తలు అవాస్తవమని, ఎవరూ స్కూటీల కోసం మీ-సేవకు వెళ్లవద్దని మహిళాశిశు సంక్షేమ శాఖ క్లారిటీ ఇచ్చింది. 

పదో తరగతి పాసై, 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులంటూ, ఆ ప్రకటన వైరల్‌ కావడంతో, మీ-సేవ కేంద్రాలకు తాకిడి పెరిగింది. ఈ అంశంపై దినపత్రికల్లో సైతం వార్తలు వచ్చాయి. 2018లో తమిళనాడులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ‘అమ్మ స్కూటర్ స్కీమ్’ను ప్రారంభించారు. అది పూర్తిగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పథకం. 

ఈ పథకం ప్రకారం లబ్ధిదారులకు స్కూటీ ధరలో 50 శాతం సబ్సిడీగా ప్రభుత్వం అందజేస్తుంది. తమిళనాడులోనే కాక రాజస్థాన్, జమ్మూ కశ్మీర్ లో కూడా ఇలాంటి పథకం ఉంది. రాజస్థాన్ లో మేధావి స్కూటీ యోజన, దేవనారాయణ ఛాత్ర స్కూటీ యోజన అనే రెండు పథకాలున్నాయి. కానీ కేంద్రం అలంటి పధకాలు ఏవీ ప్రవేశ పెట్టలేదు. తమిళనాడులో స్కూటీ పథకాన్ని మోడీ ప్రారంభించినప్పటి ఫొటోను ఇప్పుడు మళ్లీ సర్క్యూలేట్ చేస్తూ తప్పుడు వార్తలను కొందరు  వైరల్  చేశారు.