కరోనా వ్యాక్సిన్ వస్తే దాని పంపిణి ఎలా.. మోడీ సమీక్ష

ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌ కనుగొనేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇక మన దేశంలో భారత్ బయోటెక్ కంపెనీ కొవాక్సిన్ అనే వాక్సిన్‌ను తయారు చేసి కొన్ని ప్రయోగాలు కూడా జరిపింది. దీనికి భారత వైద్య పరిశోధనా మండలి , నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారం తీసుకొంది. ఇపుడు ఈ వ్యాక్సీన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు గాను రెండు అంచెలలో క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసింది. దీనిలో భాగంగానే వచ్చే జులైలో దేశవ్యాప్తంగా కొవాక్సిన్ పైన ప్రయోగాలు జరగనున్నాయి.

ఇది ఇలా ఉంటే మన దేశం ‌తో పాటు ఇతర దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ కోసం శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు పై ప్రధాని మోడీ అధికారులతో చర్చించారు. కరోనా వ్యాక్సిన్ కనుక త్వరలో విజయవంతమైతే దానిని సరసమైన ధరలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని అయన సూచించారు. ఈరోజు మధ్యాహ్నం దేశంలో కరోనా వాక్సిన్ అభివృద్ధి, పంపిణీ సన్నద్ధతపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

వాక్సీన్ తయారైన తర్వాత దేశమంతటా దానిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి? దానిని ముందుగా ఎవరికి ఇవ్వాలి దీని కోసం వివిధ డిపార్ట్‌మెంట్ల మధ్య సమన్వయం ఎలా ఉండాలన్న దానిపై మోడీ అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు.

అందరికంటే ముందుగా కరోనా ముప్పు అధికంగా ఉండే డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వృద్ధులు, చిన్నపిల్లలకు ఈ టీకాలు ఇవ్వాలి.

కరోనా వ్యాక్సిన్ తక్కువ ధరకు అందరికీ అందుబాటులో ఉండాలి. ధరల కారణంగా ఏ ఒక్కరు టీకాకు దూరం కాకూడదు.

అదే సమయంలో కరోనా వాక్సీన్ ప్రతి ఒక్కరికీ అందేలా కార్యాచరణ ఉండాలి. దేశంలోని ప్రతి ప్రాంతానికి వాక్సిన్ పంపిణీ లో ఎలాంటి ఆంక్షలు అడ్డుతగలకుందా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రత్యేక టెక్నాలజీ సాయంతో కరోనా వాక్సిన్ ఉత్పత్తి నుంచి పంపిణీ వరకు ఎటువంటి లూప్ హొల్స్ లేకుండా అన్నింటినీ సమర్ధవంతంగా పర్యవేక్షించాలి. నిర్ణీత సమయంలో సమర్థంగా వాక్సీన్ వేసేందుకు అవసరమైతే టెక్నాలజీ టూల్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలి.

ఈ రోజు ఉదయమే భారత్ లోనే తయారైన మొదటి వ్యాక్సిన్ కోవాక్సిన్ మనుషుల పై ప్రయోగాలకు సిద్దమైన వార్త వచ్చింది. ఇపుడు ప్రధాని వ్యాక్సిన్ పంపిణీ పై సమీక్ష జరపడం.. దీన్ని బట్టి త్వరలోనే మనం ఒక గుడ్ న్యూస్ వినబోతున్నామా. దేవుడి దయవల్ల అదే నిజం కావాలని అందరం కోరుకుందాం.