కిక్కిరిసిపోయిన ఏటీఎంలు.. చిల్లర కోసం పాట్లు..

 

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంతో దేశం మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయింది. నల్లధనాన్ని అరికట్టేందుకు గాను  ప్రధాని నరేంద్ర మోడీ  రూ.500, 1000 రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పుడు పలు రాష్ట్రాల్లో ఏటీఎంలు కిక్కిరిసిపోయాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలు రూ. వంద నోట్ల కోసం ఏటీఎంల వద్ద క్యూ కట్టారు. ఇక అందరూ ఒక్కసారిగా మిషన్లపై పడిపోవడంతో ఏటీఎం మిషన్లు కూడా మొరాయించాయి. ఇదిలా ఉండగా...మనీ డిపాజిట్ మిషన్లు వద్ద కూడా రూ.500, 1000 నోట్లను డిపాజిట్ చేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో క్యూ కట్టారు.

 

ఇక విజయవాడ రైల్వేస్టేషన్లో కొత్త సమస్య ఎదురైంది. అదే చిల్లర అవస్థ. రూ. 500, రూ. 1000 నోట్లు చెల్లవన్న నిర్ణయం నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి రైల్వే కౌంటర్లలో ఈ నోట్లను తీసుకోవాలన్న ఆదేశాలు ఉన్నాయి. అయితే, ఓ యాభై లేదా వంద రూపాయల టికెట్ ఖరీదు చేస్తే, ఇవ్వాల్సిన మిగతా చిల్లర తమ వద్ద లేదని, చిల్లర ఇస్తేనే టికెట్ ఇస్తామని కౌంటర్లలోని సిబ్బంది స్పష్టం చేస్తుండటంతో ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితిలో పడ్డారు ప్రజలు. దీంతో స్పందించిన అధికారులు కౌంటర్ల సిబ్బందికి వంద రూపాయల బండిల్స్ కొన్ని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ఎంతో మంది క్యూలో నిలబడి, వరంగల్ కు రూ. 90 పెట్టి టికెట్ కొని రూ. 400 చిల్లర తీసుకుని ఆ టికెట్ చించి పడేసి తిరిగి క్యూలోకి వెళ్లి 400 రూపాయల చిల్లర కోసం మరో టికెట్ కొంటున్న పరిస్థితి ఏర్పడింది.