మోడీపై విపక్షాల విమర్శలు..

 


నల్ల ధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ  రూ.500, 1000 రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయానికి కొంత మంది హర్షం వ్యక్తం చేస్తున్నా.. కొన్ని విపక్ష పార్టీలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  ప్రభుత్వ నిర్ణయం పాశవిక చర్యకు ఉదాహరణ అని ధ్వజమెత్తారు. ప్రధాని నిర్ణయంతో పేదలు చాలా ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లధనం, అవినీతికి తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రభుత్వ నిర్ణయం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు.

 

ఇంకా పశ్చిమబంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానిపై పలు విమర్శలు చేశారు.  ‘కేంద్రం అవివేకంతో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’ అని అన్నారు. నల్లధనాన్ని వెనక్కి రప్పించడంలో విఫలమవ్వడంతో ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ ఆకస్మిక తప్పుడు నిర్ణయంతో సామాన్య ప్రజల్లో తీవ్ర గందరగోళం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రధాని మోదీని తుగ్లక్ ఆత్మ ఆవహించిందని తీవ్ర విమర్శలు చేసింది. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.