తెలంగాణలో వాతావరణం కూల్ కూల్!

తెలంగాణకు భానుడి భుగభగల నుంచి ఉపశమనం లభించింది. నిన్నటి వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన తెలంగాణ వాసులు శనివారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచీ ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులతో తెలంగాణ ఎండ వేడిమి నుంచి సేద తీరింది. హైదారబాద్,  హైదరాబాద్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో  ఓ మోస్తరు వర్షం కురిసింది. మరి కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.   నిజామాబాద్‌ జిల్లాలో వర్షం కారణంగా భారీగా పంటనష్టం జరిగింది. సిద్దిపేట, దుబ్బాకలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోయింది.  
Publish Date: Apr 20, 2024 12:05PM

ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా.. ఆంధ్రులు హ్యాపీ!

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఈ నెలలో భారత్ లో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల మస్క్ ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ నెల 21, 22 తేదీలలో భారత్ లో పర్యటించాల్సిన మస్క్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. అయితే ఈ ఏడాది చివరిలో మాత్రం తప్పకుండా ఇండియాలో పర్యటిస్తానని మస్క్ తన పర్యటన వాయిదా ప్రకటన సందర్భంగా చెప్పారు. ఈ వార్త వినగానే ఏపీ ప్రజలలో ఆనందం, హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఎలాన్ మస్క్ పర్యటన వాయిదాకు, ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేయడానికి ఏమిటి సంబంధం అంటారా? అక్కడికే వద్దాం ఆగండి!  ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అతి వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన భారత్ లొ ఇన్వెస్ట్ చేయలేదు. ఇందుకు కారణం దేశంలో అధికంగా ఉన్న పన్నులే కారణమని ఇప్పుడు కాదు ఎప్పుడో 2021లోనే చెప్పారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించింది.  స్థానికంగా పెట్టుబడులు పెట్టి ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని దేశంలో ప్రారంభించే సంస్థలను ఆహ్వానించడం, ప్రోత్సహించడం కోసం ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎలాన్ మస్క్ దేశంలో  పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నారు.  అందుకే ఆయన భారత పర్యటన పెట్టుకున్నారు. ఈ సంగతి తెలియగానే పలు రాష్ట్రాలు టెస్లాను తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించేందుకు సన్నాహాలు ఆరంబించేశాయి. దేశంలో ఎన్నికల హీట్ పీక్స్ లో ఉన్నా.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచార హడావుడిలో నిండా మునిగిపోయి ఉన్నా.. రాష్ట్ర ప్రగతి కోసం మస్క్ పర్యటన సందర్భంగా టెస్లాతో ఒప్పందం కోసం సన్నాహాలు ప్రారంభించేశారు.  అయితే ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం అందుకు సంబంధించి ఇఫ్పటి వరకూ ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. కనీసం రాష్ట్రంలోని టెస్లాను ఆహ్వానించే విషయంలో సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదు. దీంతో ఎలాన్ మస్క్ పర్యటన సందర్భంగా ఏపీ వైపు ఆయన దృష్టి సారించే అవకాశాలు దాదాపు మృగ్యం అన్న భావనకు అంతా వచ్చేశారు. ఈ సందర్భంగా జగన్ హయాంలో రాష్ట్రం వైపు చూడటానికే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి దారులు భయపడిన వైనాన్ని పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. దీంతో  ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా పడటం సహజంగానే ఏపీ వాసులకు ఆనందం కలిగించింది. ఈ ఏడాది చివరిలో ఎలాన్ మస్క్ భారత పర్యటనకు రానున్నారు. అంటే అప్పటికి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. వచ్చే నెల 13న రాష్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలలో జగన్ పార్టీ పరాజయం పాలై తెలుగుదేశం అధికారంలోకి వస్తే.. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు సీఎం అయితే టెస్లా పెట్టుబడులు ఏపీకి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. కియా మోటార్స్ ను ఏపీకి తీసుకువచ్చిన చంద్రబాబు.. టెస్టాను కూడా ఏపీకి తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎలాన్ మస్క్ ఇండియా పర్యటన ఈ ఏడాది చివరకు వాయిదా పడటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.  
Publish Date: Apr 20, 2024 11:49AM

అవినాష్ రెడ్డి అఫిడవిట్ లో వివేకా హత్య కేసు

ఒక వైపు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిపై విమర్శలు చేస్తూ మాట్లాడకూడదంటూ కడప కోర్టు గాగ్ ఆర్డర్ ఇచ్చింది. మరో వైపు కడప లోక్ సభ వైసీపీ అభ్యర్థిగా  శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి తన అఫడివిట్ లో   వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి తనపై  రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిలో ఒకటి హత్య, రెండు సాక్ష్యాల విధ్వంసం కేసులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఈ కేసులు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ లో తాను ఏ8 అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కేసు విచారణ సీబీఐ కోర్టులో కొనసాగుతోందని వివరించారు.   ఈ రెండు క్రిమినల్ కేసులూ కాకుండా అదనంతా తనపై మైదకూరులో మరో కేసు ఉందని అవినాష్ రెడ్డి అఫిడవిట్ లో పేర్కొన్నారు.  ఇక ఆస్తుల విషయానికి వస్తే  తనకూ తన భార్యకూ కలిపి 25.51 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. అలాగే 32.75లక్షల రూపాయల విలువ చేసే ఇన్నోవా కారు ఉందని,  అలాగే వెలమవారి పల్లె, భకరాపురం,అంకాలమ్మగూడూరులలో తన పేరుపై 27.04 ఎకరాలు ఉన్నాయని అఫిడవిట్ లో వివరించారు.  ఇవి కాకుండా తన భార్యపేరుపై విశాఖ పట్నంలో, కడప జిల్లాలోని వల్లూరు, ఊటుకూరు, పొనకామిట్టలో  33.90 ఎకరాల భూమి  ఉందని పేర్కొన్నారు. ఎవరి నోటీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి మాట రాకూడదని కోర్టు ఆదేశాలున్నప్పటికీ, అవినాష్ రెడ్డి అనివార్యంలో తన ఎన్నికల అఫిడవిట్ లో  ఆ హత్య కేసుకు సంబంధించి తాను ఏ8గా ఉన్నాననీ, రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయనీ పేర్కొనక తప్పలేదు. మొత్తం మీద అనివాష్ ఎన్నికల అఫిడవిట్ ఇప్పుడు కడప వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 
Publish Date: Apr 20, 2024 11:07AM

వేసవికాలం డయాబెటిస్ రోగులకు ప్రమాదమా?  

వేసవికాలం  వచ్చిందంటే మండే ఎండల వల్ల అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్దులు అసౌకర్యానికి గురవుతారు. అయితే వీరు మాత్రమే కాదు.. ఎండల ధాటికి డయాబెటిక్ రోగులకు కూడా చాలా ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు వేసవికాలంలో డయాబెటిస్ రోగులకు ఉండే ముప్పేంటి? డయాబెటిస్ రోగులు తీసుకోవల్సిన జాగ్రత్తలేంటి? తెలుసుకుంటే.. వేసవి కాలం డయాబెటిస్ రోగులపైన ప్రభావం చూపిస్తుంది. అధిక వేడి  డయాబెటిక్ రోగులకు కష్టంగా ఉంటుంది.  తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి రావడం వల్ల శరీరంలో తేమను కోల్పోయే ప్రమాదం ఉంటుంది.   శరీరాన్ని చల్లగా ఉంచుకోవడంలో  ఇబ్బంది పడతారు. అందుకే ఈ  వేసవిలో  శరీర ఉష్ణోగ్రత,  చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచుకోవడానికి కింది టిప్స్ పాటించాలి. పుష్కలంగా నీరు త్రాగాలి.. వేసవి కాలంలో నీరు  బెస్ట్ ఫ్రెండ్. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.   అధిక ఉష్ణోగ్రతలు లేదా శారీరక శ్రమ కారణంగా  ఎక్కువగా చెమటలు పడుతుంటే నీరు  తీసుకోవడం పెంచాలి. హైడ్రేటింగ్ ఆహారాలు.. ఆహారంలో దోసకాయ, పుచ్చకాయ, నారింజ,  టమోటా వంటి నీరు అధికంగా ఉండే పండ్లు,  కూరగాయలను చేర్చాలి. ఈ ఆహారాలు  హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. కెఫీన్ ఆహారాలు వద్దు..  కెఫిన్ కలిగిన కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. ఇవి రక్తంలో చక్కెరపై చెడు ప్రభావాన్ని చూపి శరీరం డీహైడ్రేట్ అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. కాటన్ దుస్తులు..  కాటన్ దుస్తులను ధరించాలి. తద్వారా  శరీరం చల్లగా ఉంటుంది. చెడు శరీర ఉష్ణోగ్రత  చక్కెర స్థాయిని పాడు చేస్తుంది. సన్‌బర్న్‌ను నివారించడానికి సన్‌స్క్రీన్ ఉపయోగించండి. షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి..  రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలి.  వైద్యుల సలహా ప్రకారం  మెడిసిన్  లేదా ఇన్సులిన్ మోతాదును తీసుకోవాలి.                                                     *రూపశ్రీ.  
Publish Date: Apr 20, 2024 10:59AM

పాపం కేటీఆర్.. బావమరిదీ కారు దిగి చేయందుకున్నారు!

అంతా భ్రాంతియేనా అని పాడుకోవడమే మిగిలింది ఇప్పుడు మాజీ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం.. అధికారం ఉంటేనే నిలిచే బంధం అని వగచడమే మిటిలింది ఆయనకు.  పార్టీ ఓటమి తరువాత కేటీఆర్ నోటి దురుసు పెరిగింది. గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పైనే కాదు.. ఓటమి తరువాత పార్టీ వదిలి వెడుతున్న వారిపై కూడా ఆయన ఘాటు పదజాలంతో విమర్శలు గుప్పిస్తున్నారు. ద్రోహులంటూ నిందిస్తున్నారు. అయితే తాటాకు చప్పుళ్ల లాంటి ఆయన  దూషణలకు, బెదరింపులకు ఎవరూ వెరిచి వెనకడుగు వేయడం లేదు. వలసల దారి వలసలుగానే ఉంది. ఒక్క కేటీఆర్ మాటలు మాత్రం రీసౌండ్ లా ఆయనకే అందరి కంటే గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో అధికారంలో ఉండగా పార్టీ అధినేత, తన తండ్రి అయిన కేసీఆర్ రాజకీయ వ్యూహమే ఇప్పుడు రివర్స్ లో పార్టీని ఖాళీ చేస్తున్నట్లు కేటీఆర్ కు అవగతం అవుతోందా అంటే నెటిజనులు జోకులు పేలుస్తున్నారు. సరే పార్టీ నేతలు, సిట్టింగులు మారుతున్నారు సరే.. స్వయానా బంధువులు కూడా బంధుత్వానికీ బే, పార్టీకీ బేబ్బే అంటూ  ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్  కండువా కప్పుకుంటూ కారు దిగిపోవడాన్ని ఆయన ఎలా జీర్ణించుకుంటారో పాపం అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.  తాజాగా కేటీఆర్ కు స్వయానా బావమరిది అయిన ఎడ్ల రాహుల్ రావు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. తన భార్య సోదరుడు, పైగా బావ  అధికారంలో ఉండగా ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకుని భారీగా అక్రమార్జనకు పాల్పడ్డారన్న ఆరోపణలున్న రాహుల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం ఏ విధంగా చూసినా కేటీఆర్ కు చెప్పుకోలేని పరాభవంగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. పైగా రాహుల్ రెడ్డికి కాంగ్రెస్ గూటికి చేర్చింది.. అసెంబ్లీ ఎన్నికల ముందు కేటీఆర్ తో విభేదించి కారు దిగి.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న మైనంపల్లి హనుమంతరావు కావడం కేటీఆర్ కు మరింత ఇబ్బంది కలిగించే అంశంగా చెబుతున్నారు.   ఇటీవలి కాలంలో అంటే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత కారు దిగి వెళ్లి పోతున్న నేతలను నిలువరించడంలో ఘోరంగా విఫలమై.. తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి పార్టీ వదిలి వెడుతున్న వారిపై దూషణలకు దిగుతూ, ద్రోహులూ అవకాశ వాదులూ అంటూ నిందిస్తున్న కేటీఆర్ ఇప్పుడు తన బావమరిదే  బీఆర్ఎస్ కు జెల్ల కొట్టి కాంగ్రెస్ పంచన చేరడం ఎలా చూసినా తట్టుకోలేని అవమానంగానే పరిశీలకులు చెబుతున్నారు.  పార్టీ మారకుండా సొంత బావమరిదిని నిలువరించలేని కేటీఆర్.. పార్టీని ఏం కాపాడుతారంటూ  కేటీఆర్ ను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో కూడా కేటీఆర్ వైఫల్యాలపై అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. 
Publish Date: Apr 20, 2024 10:29AM