కర్తార్ పూర్ కారిడార్ నిర్మాణంతో సిక్కుల డెబ్భై ఏళ్ల కల నిజమవుతుంది: మోదీ

 

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజు కీలక సభల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. సిర్సా, రేవరీ తదితర సభల్లో ప్రసంగించారు, విపక్షాలు ఇప్పటికే ఓటమిని అంగీకరించాయని అన్నారు. కర్తార్ పూర్ కారిడార్ నిర్మాణంతో సిక్కుల డెబ్భై ఏళ్ల కల నిజమవుతుందని అన్నారు మోదీ. సిక్కుల ముఖంలో ఆనందం కనిపిస్తోందన్నారు. గురునానక్ దేవ్, కర్తార్ పూర్ సాహెబ్ ల మధ్య దూరం తగ్గిపోయిందన్నారు. ఈ జాతీయ రహదారికి గురునానక్ దేవ్ జీ మార్గంగా నామకరణం చేస్తున్నట్టు ప్రకటించారు. పాకిస్థాన్ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నట్లు తెలిపారు మోదీ. ఉగ్రవాదంతో పాటు భారత యువతలకు డ్రగ్స్ కు బానిసలు చేసేందుకు పాక్ కుట్ర చేస్తోందని కానీ, ఆ కుట్రను తిప్పికొట్టినట్టు చెప్పారు ప్రధాని.

పుల్వామా  దాడుల తరువాత భారత్ పాకిస్థాన్ మధ్య తొలి సారిగా చర్చలు జరిగాయి, అయితే ఆ చర్చలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు సంబంధించినది కాదు, భారత్-పాక్ మధ్య శాంతికి నాంది పలుకుతుందని భావిస్తున్న కర్తార్ పూర్ కారిడార్ గురించి. భారతీయ సిక్కులు ఎన్నో దశాబ్దాల కల ఈ కర్తార్ పూర్ కారిడార్. దీని నిర్మాణం పూర్తయితే నేరుగా పాకిస్థాన్ కు వెళ్లి తమ గురుద్వార్ ను దర్శించుకోవచ్చని భారతీయ సిక్కులు భావిస్తున్నారు. సిక్కు మతస్థుల అత్యంత పవిత్రంగా భావించే స్థలాల్లో కర్తార్ పూర్ దర్బార్ సాహెబ్ గురుద్వార్ ఒకటి. ఇది పాకిస్థాన్ లోని కర్తార్ పూర్ గ్రామంలో ఉంది, దీన్ని 500 ఏళ్ల క్రితం గురునానక్ హయాంలోనే నిర్మించారని సిక్కులు చెబుతారు. వారి విశ్వాసాల ప్రకారం సిక్కు మతానికి ఆధ్యుడైన గురునానక్ ఇక్కడే మొదటి మత సమావేశం నిర్వహించారు. పధ్ధెనిమిది ఏళ్లకు పైగా ఇక్కడే ఉన్న గురునానక్ చివరికి ఈ ప్రాంతంలోనే కన్నుమూశారు.

అప్పట్నుంచీ ఇది సిక్కులకు అత్యంత పవిత్ర స్థలంగా మారింది కానీ, పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయాక ఈ కర్తార్ పూర్ పాకిస్థాన్ భూభాగంలో కలిసిపోయింది. కర్తార్ పూర్ గురుద్వార్ భారత సరిహద్దుకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో రావి నది ఒడ్డున ఉంది. అదే నదికి ఇవతలి వైపున భారతీయ భూభాగంలో మరో ప్రసిద్ధ డేరా బాబా నానక్ గురుద్వారా కూడా ఉంది. దేశ విభజన తరువాత భారతీయ సిక్కులు ఆ రావి నది పైన ఉన్న వంతెన పై నుంచే అనధికారికంగా వెళ్లి కర్తార్ పూర్ గురుద్వారను దర్శించుకునే వారని చెబుతారు. కాని పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ పాక్ యుద్ధం తరువాత ఆ వంతెన ధ్వంసమైంది.

దాంతో సిక్కుల రాకపోకలు నిలిచిపోయాయి, అప్పట్నుంచీ రెండు గురుద్వారాలను అనుసంధానం చేస్తూ మార్గం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ లు పెరిగాయి. భారత భూభాగం నుంచే కర్తార్ పూర్ గురుద్వారా కనిపిస్తుంది, అది మరింత స్పష్టంగా కనిపించేందుకు పాక్ అధికారులు తరచూ మధ్యలో దట్టంగా పెరిగిపోయే గడ్డిని కత్తిరిస్తుంటారు. అయితే ఈ ఇబ్బందులేవీ లేకుండా నేరుగా రెండు గురుద్వారాల మద్య మార్గాన్ని ఏర్పాటు చేయాలన్న అధికారిక ప్రతిపాదన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముందుకు కదిలింది.

తొలిసారి ఢిల్లీ నుంచి లాహోర్ కు బస్సులు ఏర్పాటు చేసినప్పుడు ఆ బస్సులో నాటి ప్రధాని వాజ్ పై ప్రయాణించారు. నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ముందుకు ఆయనే ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు, ఆ తరువాత పాకిస్తాన్ కూడా గురుద్వారాను పునరుద్ధరించి భారత్ నుంచే దాన్ని చూసేందుకు అనువైన ఏర్పాట్లు చేసింది. ఇన్నేళ్ళ తరవాత మళ్ళీ ఆ కారిడార్ నిర్మాణం ముందుకు కదిలింది, ఇటీవలే ఇటు భారత్ లో అటు పాకిస్తాన్ లో కూడా కారిడర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ప్రతిపాదనల ప్రకారం డేరా బాబా నానక్ గురుద్వారా నుంచి సరిహద్దు వరకు మార్గాన్ని భారత్ నిర్మిస్తే, అటు కర్తార్ పూర్ నుంచి సరిహద్దు వరకు మార్గాన్ని పాకిస్థాన్ నిర్మిస్తుంది.

ఇది పూర్తయితే ఎలాంటి వీసా, పాస్ పోర్టు అవసరం లేకుండా భక్తులు ఒకే రోజులో భారత్ నుంచి కర్తార్ పూర్ గురుద్వారాకు వెళ్లి వచ్చేలా ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. గురునానక్ ఐదు వందల యాభైవ జయంతి నాటికి అంటే రెండు వేల పంతొమ్మిది నవంబర్ కల్లా ఈ కారిడార్ ను పూర్తి చేయాలని ఇటు భారత్ తో పాటు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భావించింది. ఈ నిర్మాణం పూర్తయిన తరువాత భారత్-పాక్ ల మధ్య బంధం ఎలా కొనసాగుతుందో చూడాలి.