నోట్ల రద్దుపై జపాన్ లో మోడీ..

 


ప్రధాని నరేంద్ర మోడీ రూ. 500, 1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు ప్రకటన తరువాత ఇంతవరకూ దీనిపై స్పందించని మోడీ ఇప్పుడు ఈ విషయంపై మాట్లాడారు. ప్రస్తుతం ఆయన జపాన్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా జ‌పాన్‌లోని కోబెలో భార‌త సంత‌తి ప్ర‌జ‌ల‌తో జ‌రిగిన స‌మావేశంలో మాట్లాడిన ఆయన పెద్ద‌ నోట్ల ర‌ద్దును స్వాగ‌తించిన దేశ ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇంకా నోట్ల రద్దుపై ఆందోళన అవసరం లేదు.. డిసెంబరు 30 వరకూ నగదు మార్పిడి, డిపాజిట్లు చేసుకోవచ్చని తెలిపారు. నల్ల ధనం విషయంలో ఎవర్నీ ఉపక్షించం.. నల్ల కుబేరుల వేట కొనసాగుతుంది.. నిజాయితీగా వ్యవహరించిన వారిని ఇబ్బంది పెట్టం .. ఈ నిర్ణయం ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదు.. అవినీతి అంతమొందించడానికే అని తెలిపారు. దొంగ డ‌బ్బును వెలికి తీయాలా లేదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. గ‌తంలో గంగా న‌దిలో ఎవ్వ‌రూ ఒక్క రూపాయి కూడా వేయ‌క‌పోయేవార‌ని, ఇప్పుడు అదే న‌దిలో 500, వెయ్యి నోట్లు ప్ర‌వ‌హిస్తున్నాయ‌న్నారు. తాము తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగ‌తించిన ప్ర‌జ‌ల‌కు మోదీ సెల్యూట్ చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్ర‌జ‌ల‌కు త‌మ‌కు మ‌ద్ద‌తుగా నిలిచార‌ని ఆయ‌న అన్నారు. న‌ల్ల‌ధ‌నాన్ని ఎలా వెలికి తీయాల‌ని తీవ్రంగా ఆలోచించాన‌ని, దానికి సంబంధించి త‌మ టీమ్ కూడా మార్గాల‌ను అన్వేషించింద‌ని, కానీ ఎవ‌రితోనూ తాను ఆ అభిప్రాయాన్ని పంచుకోలేద‌ని ఈ సంద‌ర్భంగా మోదీ తెలిపారు. పెద్ద నోట్ల ర‌ద్దు అతిపెద్ద స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మ‌మ‌ని, ఎవ‌రినీ బాధ‌పెట్టేందుకు తీసుకున్న నిర్ణయం కాద‌న్నారు.