పితాని కూడా జంప్

 

కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీకిలో కార్యకర్తలెవరయినా ఉన్నారో లేదో ఖచ్చితంగా తెలియదు, కానీ ఒక అరడజను మంది నేతలు మాత్రం ఇంకా పార్టీలో మిగిలి ఉన్నారు. అయితే వారిలో కూడా ఒకరొకరుగా మెల్లగా వేరే పార్టీలలోకి జారుకొంటున్నారు. తాజాగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పితాని సత్యనారాయణ తెదేపాలోకి జంపైపోయారు.ఆయన చంద్రబాబు చేతులతో పసుపు కండువా కప్పించుకొని తెదేపా తీర్ధం కూడా సేవించారు.

 

శుక్రవారం తెనాలిలో జరిగిన సభలో ఆ పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి కనిపించిన హర్షకుమార్, రెండు రోజుల క్రిందటే తనకు డిల్లీ నుండి దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి పార్టీలోకి తిరిగి రమ్మని ఆహ్వానించారని, కానీ పార్టీయే తమను బయటకు వెళ్ళగొట్టింది గనుక ముందు తనపై వేసిన ఆ పార్టీ బహిష్కరణ వేటుని ఎత్తేస్తే అప్పుడు పార్టీలోకి తిరిగి రావడం గురించి ఆలోచిద్దామని జవాబు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దానితో ఆయన తాను జైసపాను వీడి వెళ్ళడం లేదని, ఆ పార్టీ టికెట్ పైనే తాను అమలాపురం నుండి లోక్ సభకు పోటీ చేయబోతున్నట్లు ప్రకటించేసి అప్పటికి మంటలార్పగలిగారు. కానీ రేపు మళ్ళీ దిగ్విజయ్ నుండి డిల్లీకి రమ్మని కాల్ వస్తే, అప్పుడు కిరణ్ పెట్టుకొనే తరువాత సభలో ఆయన మరి కనిపిస్తారో లేదో అనుమానమే. ఈ మునిగిపోతున్న నావలో మరెవరూ లేరని రూడీ చేసుకొన్నాక ఆఖరుగా కెప్టెన్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా బయటకు దూకుతారేమో!