మంత్రి పదవులకు మోపిదేవి, సుభాష్ చంద్రబోస్ రాజీనామా

ఇటీవల ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ నాలుగూ గెలుచుకున్న సంగతి తెలిసిందే. వారిలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ ఇద్దరు నేతలు తమ ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేశారు. 

రాజ్యసభకు ఎన్నికైన 14 రోజుల్లోగా వారి పదవులకు రాజీనామా చేయాల్సి ఉండడంతో.. ఎమ్మెల్సీ పదవుల రాజీనామా లేఖలను మండలి కార్యదర్శికి అందజేశారు. వీరి రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోద ముద్ర వేశారు. అలాగే, మంత్రి పదవుల రాజీనామా లేఖలను సీఎం వైఎస్ జగన్‌కు పంపారు.

మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో వారి స్థానంలో సీఎం జగన్ ఎవరిని తన కేబినెట్ లోకి తీసుకుంటారోనన్న ఆసక్తి అధికారపార్టీ వర్గాల్లో నెలకొంది.