తెలంగాణలో ముందస్తు వద్దు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌

 

తెలంగాణలో ముందస్తు ఎన్నికలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.. ఈ మధ్య హైకోర్టులో కూడా తెలంగాణలో ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.. అయితే హైకోర్టు ఆ పిటిషన్ ని కొట్టేసింది.. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టులో ముందస్తుకు సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది.. రాష్ట్రంలో గడువు కంటే ముందే ఎన్నికలు నిర్వహించడం వల్ల పౌరులకు నష్టమని పేర్కొంటూ సిద్ధిపేటకు చెందిన పోతుగంటి శశాంక్‌రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.. తెలంగాణలో సాధారణ ఎన్నికల సమయానికి దాదాపు 20లక్షల మందికి పైగా యువత ఓటుహక్కు పొందేందుకు అవకాశముంటుందని, ముందస్తు ఎన్నికల వల్ల వారంతా ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. 

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని, పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న ప్రభుత్వమే అధికారంలో ఉందని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు.. స్వయంగా ముఖ్యమంత్రే.. ఎన్నికల సంఘంతో మాట్లాడిన తర్వాతే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పడం అర్థరహితమన్నారు. ఫలానా సమయంలో ఎన్నికలు జరుగుతాయని, మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి, రాజకీయ సంక్షోభం లేకపోయినా కేవలం రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైందని తెలిపారు.. ఈ అంశాలను దృష్టిలోకి తీసుకుని తెలంగాణలో గవర్నర్‌ పాలన విధించాలని కోరారు.. సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, అప్పటివరకు గవర్నర్‌ పాలన అమల్లో ఉండటం వల్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతుందని పిటిషనర్‌ పేర్కొన్నారు.. మరి ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.