పేర్ని నానికి చెక్ పెట్టేందుకు సిద్దం అవుతున్న కాంగ్రెస్

 

కాంగ్రెస్‌ పార్టీకి హ్యాండిచ్చి వైకాపాలోకి జంపు చేసిన కాంగ్రెస్ శాసన సభ్యుడు పేర్నినాని చాలా కీలకమయిన బాధ్యతలు చేపట్టవచ్చుననే గొప్పకలలు కంటూ ఆ పార్టీలోకి దూకితే అక్కడ పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నగనిపిశెట్టి గోపాల్ వంటి వారు అనేక మంది వచ్చే ఎన్నికలలో మచిలీపట్టణం అసెంబ్లీ, పార్లమెంటు నియోజక వర్గలాపై చాల ఆశలు పెట్టుకొని ఉండటంతో, హట్టాతుగా ఊడిపడిన పేర్నినాని రాకతో కలవరం చెందుతున్నట్లు సమాచారం. అదే విషయం ఇటీవల వారు నిర్వహించిన బందరు పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో చర్చకు కూడా వచ్చినట్లు సమాచారం. వారిలో కొందరు నేతలు వైకాపా అధిష్టానం తమను కాదని కొత్తగా వచ్చిన పేర్నినాని మాటకే ఎక్కువ విలువీయడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపద్యంలో పేర్నినానికి వైకాపాలో కుదురుకోవడానికి మరి కొంచెం సమయం పట్టవచ్చును.

 

ఇక, మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా పేర్ని స్థానంలో ఆయనకి సమఉజ్జీలను నియమించుకొని, వచ్చే స్థానిక ఎన్నికలలోపుగానే నియోజక వర్గంలో ఆయన ప్రాదాన్యత పూర్తిగా తగ్గించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. మంత్రి కె. పార్థ సారథి, మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్, మాజీఎంపీ బాడిగ రామకృష్ణలను ముగ్గురికీ బందరు నియోజక వర్గంలో బాధ్యతలు అప్పగించడం ద్వారా పేర్ని నానికి చెక్ పెట్టే ప్రయత్నాలు మొదలయాయి.

 

2004లో బందరు నుంచి ఎంపీగా గెలుపొందిన బాడిగ రామకృష్ణ ఆ తరువాత ఎన్నికలలో ఓటమి పాలవడంతో, ఆయన తన రాజకీయ కార్యకలాపాల జోరు కొంచెం తగ్గించుకొన్నారు. కానీ, మారిన రాజకీయ నేపద్యంలో, పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవవడంతో ఆయన ఇటీవలే బందరులో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, స్థానిక సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా మునిసిపల్ కమిషనర్‌ను కలిసి తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. అంతే కాకుండా మునిసిపాలిటీకి రెండు నీళ్ళ ట్యాంకర్లను కూడా అందజేశారు.

 

మరో వైపు నుండి మంత్రి కె. పార్థ సారథి, వేదవ్యాస్ వంటి వారు కూడా తమ కార్యకర్తలతో సమావేశాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ విధంగా ముగ్గురు ఉద్దండులయిన కాంగ్రెస్ నేతలు బయట నుండి పేర్నినాని పరిధిని కుచించే ప్రయత్నాలు మొదలుపెడితే, మరో వైపు వైకాపాలో నేతల నుండి వ్యతిరేఖత కూడా ఎదుర్కోవడం పేర్నినానికి కత్తి మీద సామే అవుతుంది.

 

ఎన్నికలు దగ్గిర పడుతున్నకొద్దీ పార్టీ టికెట్ కోసం పోటీ తీవ్రతరం అయినప్పుడు మరి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆయనకే టికెట్ ఇస్తారో లేక మరెవరయినా దానిని ఎగరేసుకుపోతారో చూడాలి. అదే గనుక జరిగితే పేర్నినాని పని రెంటికీ చెడిన రేవడిగా మారుతుంది. అయితే, నియోజక వర్గంలో మంచి పలుకుబడి, అనుచరుల మద్దతు ఉన్న పేర్నినానికే పార్టీ టికెట్ దక్కే అవకాశాలున్నాయి. గానీ, అంతవరకు ఎదురయ్యే ఒత్తిళ్ళను భరించడమే ఆయనకు ఒక అగ్ని పరీక్ష అని చెప్పవచ్చును.