ఘనంగా పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలు... దీని వెనుకా రాజకీయమేనా?

 

అర్జీలకు పనులూ కావు, ఆశీర్వచనాలకు బిడ్డలూ పుట్టరు అన్న నానుడిని విస్మరించినట్లుగా ఉందట చిత్తూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల తీరు. నిజానికి జిల్లా కేంద్రం చిత్తూరులో రాజకీయంగా ఏది జరిగినా అది సంచలనమే అవుతుంది. ఇలాంటి పరిస్థితులున్న చోట తాజాగా చోటు చేసుకున్న మరో పరిణామం చర్చ నీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి జన్మదిన వేడుకలను చిత్తూరు జిల్లాలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ నాయకులు, కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున జరిపిన ఈ సంబరాలు అంబరాన్నంటాయి. అయితే జిల్లా వ్యాప్తంగా జరిగిన వేడుకలు ఒకెత్తైతే చిత్తూరు నగరంలో జరిగిన వేడుకలు మరొకెత్తుగా నిలవడం విశేషం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం సీఎం జగన్ తరువాత ప్రత్యేక గుర్తింపు కలిగిన నేతగా మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుక తన సొంత జిల్లా చిత్తూరులో ఓ రేంజ్ లోనే జరిగిందని పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయి, ఎందుకంటే జిల్లాలో అలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయట.

జిల్లా కేంద్రం చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీకి చెందిన నాయకులు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడి నిర్వహించడం హాట్ టాపిగ్గా మారింది. ముఖ్యంగా ముగ్గురు నాయకులూ తమ తమ అనుచరులతో కలిసి వేరువేరుగా మంత్రి పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఆయనపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. అందులోనూ ఇద్దరు నాయకులు పోటీ పడి నువ్వా నేనా అన్న రీతిలో వేడుకలను నిర్వహించడం విశేషం. అయితే వారిద్దరూ అంతగా ఎందుకు పోటీ పడి వేడుకల్ని నిర్వహించారనే విషయానికొస్తే రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఇరువురు కూడా నగర మేయర్ పదవిపై ఆశలు పెట్టుకోవడం అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకనే ఆ ఇద్దరు నాయకులు ఎవరికి వారుగా పై చేయి సాధించేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి జన్మదిన వేడుకలను పోటా పోటీగా నిర్వహించారనే ప్రచారం సాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం కో కన్వీనర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుల్లెట్ సురేష్ చిత్తూరు నగర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా వింగ్ అధ్యక్షురాలు పివి గాయత్రిదేవి ఈ ముగ్గురు మంత్రి పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలను చిత్తూరు నగరంలో ఎవరికి వారు వేర్వేరుగా నిర్వహించారు.

వీరిలో బుల్లెట్ సురేష్, చంద్ర శేఖర్ లు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితులు, ప్రియశిష్యులు, నమ్మిన బంట్లు కావడమనేది చెప్పుకోదగ్గ అంశం. ఆయన జన్మదినం రోజున ఉదయాన్నే గాంధీ విగ్రహం వద్ద చంద్రశేఖర్ హంగమా చేశారు. తన అనుచరులతో కలిసి పుట్టినరోజు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. తర్వాత మధ్యాహ్నం తపోవనం పాఠశాలలో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు జరిపారు. చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రెండు కార్యక్రమాలకు ఆయన అనుచర గణం నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.  బుల్లెట్ సురేష్ ఆధ్వర్యంలో ఎంఎస్సార్ జంక్షన్ వద్ద మధ్యాహ్నం వేళ పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో చేరుకున్న అనుచరులు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ప్రజల నడుమ తొలుత భారీ కేక్ కట్ చేశారు. తర్వాత పేదలకు అన్నదానం కార్యక్రమం చేశారు. అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా వింగ్ అధ్యక్షురాలు పివి గాయత్రిదేవి స్థానిక కొంగారెడ్డిపల్లె ఎస్టేట్ లోని ఎస్సీ ఎస్టీ గురుకుల బాలికల పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థుల మధ్య పెద్దిరెడ్డి జన్మదిన వేడుక నిర్వహించారు.

ఇలా ఎవరికి వారు వేర్వేరుగా మంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాయత్రిదేవి అంశాన్ని పక్కకు పెట్టి బుల్లెట్ సురేష్, చంద్ర శేఖర్ ల విషయానికొస్తే వీరిద్దరు మాత్రం నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడి మంత్రి పెద్దిరెడ్డి జన్మదినవేడుకలు జరిపారట. వీరిద్దరూ త్వరలోనే జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమం లోనే వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలను తమ బలప్రదర్శనకు వేదికగా మార్చుకున్నారట. ఎవరికి వారు తమ సత్తా చాటాలనే ఉద్దేశంతోనే రామచంద్రా రెడ్డి జన్మదిన వేడుకలను పోటాపోటీగా జరిపారని అంటున్నారు. బుల్లెట్ సురేష్ ఇప్పటికే పలు పార్టీలో కొనసాగారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చిత్తూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపునకు తీవ్రంగా కృషి చేయడం జరిగింది. మొదలియార్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో చిత్తూరులోని ఆ కులస్తుల్లో ఆయనకు మంచి పట్టుంది.

బీసీ నేత ఆర్ కృష్ణయ్యతోనూ బుల్లెట్ సురేష్ కు మంచి సత్సంబంధాలు కలిగిన కారణంగానే సమైక్య రాష్ట్రంలోనే కాకుండా విభజిత ఏపీలోని బీసీ సంక్షేమ సంఘం కో కన్వీనర్ పదవిలో బుల్లెట్ సురేష్ కొనసాగుతున్నారు. ఇక చంద్రశేఖర్ విషయానికొస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నారు. ఇపుడు చిత్తూరు నగర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే గెలుపునకు కృషి చేశారు. ఈయన సైతం గౌండర్ బీసీ కులానికి చెందిన వ్యక్తి కావడంతో వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో బుల్లెట్ సురేష్ చంద్ర శేఖర్ మధ్య పోటీ ఏర్పడిందట.

ఈ క్రమం లోనే వచ్చిన పెద్దిరెడ్డి జన్మదినం వేడుకలను వీరిద్దరూ పోటా పోటీగా నిర్వహించడానికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  త్వరలో చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికలు రెండో సారి జరగనున్నాయి, రెండు వేల పద్నాలుగులో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వు అయింది. ఈసారి అది జనరల్ కేటగిరీకి కేటాయిస్తారని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు కానీ, ఒక్క ఎస్సీ ఎస్టీ వర్గానికి మినహా మిగిలిన ఏ వర్గానికి రిజర్వేషన్ వచ్చినా అది జనరల్ క్యాటగిరీ అయినా సరే మేయర్ పదవి కోసం తామే పోటీ అన్న నమ్మకంతో చంద్ర శేఖర్, బుల్లెట్ సురేష్ లు ముందుకు వెళుతున్నారట. మరి చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వీరిద్దరి ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాలి.