మళ్ళీ మొదటికొచ్చిన తెలంగాణ సమస్య

 

తెలంగాణా కాంగ్రెస్ యంపీలను నయాన్నో లేక భయాన్నో ఎలాగయినా ఒప్పించి తమ పార్టీలోకి రప్పించుకొందామని కేసీఆర్ చేసిన ప్రయత్నాలను, సోనియాగాంధీ కేశవరావుతోఒకే ఒక్క సమావేశం జరిపి అతని అడియాసలు చేసారు.

 

ఇక తెరాస కాంగ్రెస్ యంపీలమీద ఆశలు వదులుకొంటున్న తరుణంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి పీసీ చాకో ‘తెలంగాణా అంశం యుపీయే ఎజెండాలో లేదంటూ చేసిన ఒకేఒక ప్రకటనతో పరిస్థితి అంతా ఒక్కసారిగా తారుమారయి, మళ్ళీ తెరాస ఆశలకు ఊపిరిపోసింది.

 

తెరాస నేత హరీష్ రావు మాట్లాడుతూ చాకో భాద్యతా రాహిత్యంతోనో లేక అవగాహనా రాహిత్యంతోనో చేసిన ప్రకటన ఎంత మాత్రం కాదని, ఆయన ప్రకటన కాంగ్రెస్ అధిష్టానం మనసులో మాటనే స్పష్టంగా మరోమారు బయట పెట్టిందని ఆయన అన్నారు. అందువల్ల తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఇప్పటికయినా కళ్ళు తెరవాలని, తెలంగాణా అంశం తమ ఎజెండాలో లేదని కాంగ్రెస్ అధిష్టానం ఇంత స్పష్టంగా ప్రకటించిన తరువాత కూడా ఇంకా గడువులు పెట్టుకొంటూ కాలక్షేపం చేయడం తగదని, నిజంగా తెలంగాణా కోరే వారందరూ కాంగ్రెస్ గడప దాటి వచ్చి తమతో చేతులు కలపాలని ఆయన వారికి పిలుపునిచ్చారు.

 

తెలంగాణా అంశం కాంగ్రెస్ ఎజెండాలో లేదని చెప్పిన కాంగ్రెస్ జెండాను తెలంగాణాలోనుండి అందరూ కలిసి పీకి పారేద్దామని, తెలంగాణా సాదించుకొనేందుకు తెలంగాణా కాంగ్రెస్ నేతలు అందరూ తమతో చేతులు కలపాలని ఆయన కోరారు. చాకో చేసిన ఒకే ఒక ప్రకటనతో తెలంగాణా అంశం మళ్ళీ మొదటికి వచ్చినట్లయింది.

 

ఇక, చాకో ప్రకటనతో కేశవ్ రావుతో సహా తెలంగాణా కాంగ్రెస్ నేతలందరూ భగ్గుమన్నారు. ఈ రోజు యంపీ వివేక్ ఇంట్లో సమావేశమయిన వారందరూ, చాకో ప్రకటనను తీవ్రంగా ఖండించారు. చాకో చాలా భాద్యతా రాహిత్యంగా మాట్లాడారని వారన్నారు. అంత కాక, కాంగ్రెస్ ఆదిష్టానం ఈనెల 30వ తేదీలోగా తెలంగాణపై స్పశాతమయిన ప్రకటన చేయకపోతే తామందరమూ పార్టీని వీడేందుకు కూడా వెనుకాడమని వారు తెలిపారు.

 

దానితో చాకో మళ్ళీ మాట మర్చి తెలంగాణా అంశం పార్టీ ఎజెండాలో ఉందని దానిపై చర్చలు ముగిసిన అనంతరం పార్టీ తగిన నిర్ణయం తీసుకొంటుందని ఆయన ఈరోజు మరో ప్రకటన విడుదల చేసారు.