గుర్నాథం! కాణిపాకం వస్తావా? పయ్యావుల కేశవ్

 

ప్రస్తుత రాజకీయాలలో ఒకరిమీద మరొకరు వేసుకొంటున్న నిందలు, చేసుకొంటున్న ఆరోపణలు, బయట పెడుతున్న వ్యాపారలావాదేవీల రహస్యాల వలన అర్ధమవుతున్న విషయం ఏమిటంటే అందరూ ఆ తానూ ముక్కలేనని. అంతే కాదు, ఏ రాజకీయకుడు కూడా కేవలం ప్రజాసేవ చేసుకొంటూ బ్రతికేయట్లేదని మరో నిజం కూడా బయటపడుతోంది. అధికారం, రాజకీయాలు రెండూ కూడా వారి వృత్తి అయితే, వ్యాపారాలు, కాంట్రాక్టులు వారి ప్రవృత్తి అని అర్ధం అవుతుంది.

 

తేనే తీసిన చేతిని నాకడం ఎంత సహజమో, చెరువులో చేపలు నీళ్ళు తాగడం ఎంత సహజమో అధికారం, రాజకీయ అండదండలు, పలుకుబడి ఉన్న అటువంటి వ్యక్తులు వాటిని తమ వ్యాపార ప్రయోజనాలకు వాడుకోవడం కూడా అంతే సహజం. అయితే, అది ఆశ నుండి అత్యాశగా, దురాశగా మారినప్పుడు ఎవరో ఒకరు వేలెత్తి చూపకమానరు.

 

మరి తెదేపా నేత పయ్యావుల కేశవ్ విషయంలో అదే జరిగిందని వైకాపా నేత గురనాథ రెడ్డి ఆరోపణలు సందిస్తుంటే, ఆ ఇద్దరి నేతల మద్య షరా మామూలుగానే మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరడం, ముందు దానిని మీడియా స్క్రోలింగు బారుకి తగిలించేసి ఆనక నలుగురుని పిలిచి చర్చలు పెట్టడం షరా మామూలే.

 

ఇటీవలే, వైకాపా నేత గురనాథ రెడ్డి పయ్యావుల కేశవ్ పై తన తొలి అస్త్రం సందిస్తూ, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డితో ఆయనకీ వ్యాపార లావాదేవీలున్నాయని బాంబు పేల్చారు. ఇంకేముంది? ఇటీవల మన రాజకీయ నాయకులకు బాగా అలుసయిపోయిన కాణిపాకం వినాయక స్వామికి మళ్ళీ పనితగిలింది. పయ్యావుల కేశవ్ గురునాధరెడ్డికి సవాలు విసురుతూ “నాకు గాలితో ఎటువంటి వ్యాపారలావదేవీలు లేవని నేను కాణిపాకం వినాయకుడి మీద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మరి నువ్వు చేస్తున్న ఆరోపణలు నిజమేనని నువ్వు కూడా ప్రమాణం చేయగలవా? నాపై చేసిన ఆరోపణలకు నేను ఎటువంటి విచారణకయినా నేను సిద్ధం. మరి నీ వ్యాపార లావాదేవీలపై విచారణకు సిద్ధమేనా? నేను గాలిని ఏదో పెళ్లి సందర్భంలో కలుసుకొన్నాను. అధిపట్టుకొని నాకు ఆయనకీ ముడిపెట్టేయడమేనా?” అని ప్రశ్నించారు.

 

ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు, ఖండన ముండనాలన్నీ మీడియాకు మరో మంచి మసాలా వార్తా దొరికే వరకు కనిపిస్తుంటాయి. ఆ తరువాత షరా మామూలే మళ్ళీ!