2019 ఎన్నికల కురుక్షేత్రం..జమ్మిచెట్టుపై ఆయుధాలు

 

తిత్లీ తుఫాను శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.జన సేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్నారు.శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస నియోజకవర్గాల్లో పర్యటించారు. కూలిన తోటలను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ..మరో కోనసీమ అయిన ఉద్దానం తుపానుతో నాశనమైందని.. 25 సంవత్సరాలు వెనక్కి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వాన్ని విమర్శించేందుకు తాను రాలేదని, బాధితులకు అందుతున్న సహాయం పర్యవేక్షించేందుకు సామాన్యుడిగా వచ్చానని తెలిపారు. కేరళలో తుపాను బాధితులకు కోట్ల రూపాయల సహాయం అందించారని, వెనుకబడిన ప్రాంతం ఉద్దానానికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదన్నారు. జిల్లాలో జరిగిన విపత్తు వల్ల వలసలు పెరిగే అవకాశం ఉందని, జిల్లావాసులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజల కన్నీళ్లు, కష్టాలు ప్రభుత్వానికి అర్థం కావాలన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎవరితోనైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

జనసేన పార్టీ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి రాలేదని పవన్‌కల్యాణ్‌ అన్నారు.'2009లో కొందరి వల్ల మోసపోయాం. ఓటమి లోతుల్లో నుంచి జనసేన ఆవిర్భవించింది. ప్రజలు మార్పును బలంగా కోరుకుంటున్నారు. 2019 ఎన్నికల కురుక్షేత్రం సమీపిస్తోంది. యుద్ధం చేసేందుకు జమ్మిచెట్టుపై నుంచి ఆయుధాలు తీశా. ధర్మం గెలిచేవరకు పోరాడతా’ అని పవన్‌ స్పష్టం చేశారు.యువత భృతిని కోరడంలేదని, తమ జీవితం తాము నిర్మించుకునే అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారన్నారు.యువతలో ఎంతో ఆవేదన ఉందన్న పవన్..యువతకు 25 సంవత్సరాల భవిష్యత్తు నిర్మించేందుకు జనసేన పోరాటం చేస్తుందని హామీనిచ్చారు తాను రాజకీయం చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు అండగా ఉండేందుకే వచ్చానన్నారు.