బీజేపీ-జనసేన దోస్తీ.. ఫుల్ క్లారిటీ వచ్చేసింది

బీజేపీ-జనసేన పార్టీ నేతల సమావేశం ముగిసింది. ఏపీలో బీజేపీ- జనసేన పార్టీ కలిసి పనిచేయనున్నాయని అధికారిక ప్రకటన వచ్చింది. ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మోదీని ఇష్టపడేవారు, జనసేన భావజాలాన్ని మెచ్చినవారంతా ఒక గూటికిందకు వచ్చామని తెలిపారు. 

టీడీపీ, వైసీపీల ప్రభుత్వాలతో ప్రజలు విసిగి పోయారని.. ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఆ ప్రత్యామ్యాయమే బీజేపీ-జనసేన అని చెప్పారు. 2024లో ఏపీలో బీజేపీ-జనసేనల ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ, అవినీతి, నిరంకుశ పాలనను ప్రక్షాళన చేసే విధంగా తమ పొత్తు పని చేస్తుందని పవన్ తెలిపారు. రాజధానిపై ఐదు కోట్ల ప్రజలు పెట్టుకున్న ఆశలను వైసీపీ వమ్ము చేసిందని ఆరోపించారు. ఏపీ రక్షణ కోసం తమ కూటమి పని చేస్తుందని తెలిపారు. రెండు పార్టీల మధ్య అవగాహన కోసం కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేస్తామని పవన్ వెల్లడించారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండటం రాష్ట్రానికి చాలా మంచిదని తెలిపారు. స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని పవన్ చెప్పారు.