ఓడిపోయినా కూడా ప్రజల్లోనే ఎందుకు తిరుగుతున్నానో తెలుసా?: పవన్

రెండు రోజుల పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాకు వచ్చిన పవన్ కల్యాణ్ ముందుగా సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. తర్వాతి రోజు కూడా అక్కడే ఉండి పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. స్థానిక రైతులు, చేనేత కార్మికులు ప్రజల కష్టాలు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధులు చిన్నపాటి వంతెన కూడా నిర్మించలేకపోతే ఎన్నికల్లో గెలిచి ఏం ప్రయోజనమని జనసేనాని ప్రశ్నించారు. ప్రలోభాలకు లోనై ఓట్లేస్తే ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయని చురకలంటించారు. 

జోరాపురం వంతెన సమస్యపై స్థానికులతో చర్చించారు. ఎమ్మిగనూరులో చేనేత కార్మికులతో భేటీ అయ్యారు పవన్. వారి గోడు విన్న పవన్ సమస్యలపై పోరాటానికి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. మిగతా నాయకుల్లాగా మాటలు చెప్పి తప్పించుకోనని, భవిష్యత్తులో మీ బిడ్డలకు కష్టాలు రాకుండా చూసుకునే అవకాశం దక్కితే అంతే చాలు అంటూ పవన్ భావోద్వేగానికి లోనయ్యారు. చేనేతల సమస్యలపై కేంద్రం దిగొచ్చేలా కలిసి పోరాడదామని హామీ ఇచ్చారు. 

ఎన్నికల ముందు వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లు పెన్షన్ లు పెంచాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయినా తానింకా ప్రజల్లోనే ఎందుకు తిరుగుతున్నానో అర్థం చేసుకోవాలని ఆయన వేడుకున్నారు. జనం కష్టాలూ, కన్నీళ్లలో అండగా ఉండటానికే జనసేన పార్టీని స్థాపించానని చెప్పారు. వెంటనే అధికారంలోకి రావడం తన టార్గెట్ కానేకాదన్నారు. పవర్ అంటే నిజమైన అర్థం ప్రజల కష్టాలు తీర్చేదని, తన చేతుల్లో పవర్ ఉంటే అందరి కష్టాలు తీర్చే వాడిని అని పవన్ కళ్యాణ్ చెప్పారు.