తెలుగు రాదు కానీ డబ్బు కావాలి.. పవన్ టార్గెట్ చేసింది ఏ హీరోని?

 

తెలుగు విషయంలో టాలీవుడ్ వ్యవహరిస్తున్న తీరు పై అసహనం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాయలసీమలో పర్యటస్తూ.. ఆయన తిరుపతిలో తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ తీరు పై విమర్శలు గుప్పించారు. తెలుగు సినిమా సాహిత్యం రానురాను దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు హీరోలకు తెలుగు రాయడం, మాట్లాడటం రాదన్నారు. తెలుగు సినిమాలతో వచ్చే డబ్బులు మాత్రమే హీరోలకు కావాలని మండిపడ్డారు. ఏపిలో తెలుగు మీడియం రద్దు పై తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదన్నారు. తెలుగు సినిమాలు తీస్తూ ఎవరూ మాట్లాడకపోవటం పై విభిన్న వర్గాల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. ఏపీ ప్రభుత్వ నిర్ణయం పై విమర్శలు చేసి లేనిపోని చిక్కులు తెచ్చుకోవడం ఎందుకని నోరు విప్పలేదని కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ తీరు పై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారని అంచనా వేస్తున్నారు. అందులోనూ తాను ఒక హీరోగా ఉన్నవారే.. అయినా కూడా తోటి హీరోలపై గురి పెట్టడమే చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

ఇప్పుడున్న యువతరం హీరోల్లో ఎక్కువ మంది వారసులే ఉన్నారు. వాళ్లలో చెన్నైలో పుట్టి పెరిగినవారే ఎక్కువ. ఇంగ్లీష్ మీడియంలో తమిళం ఒక సబ్జెక్టుగా చదువుకుని ఉంటారు కానీ తెలుగు చాలామందికి తెలియదు. మాట్లాడ్డం మాత్రమే ఎక్కువ మంది హీరోలకి వచ్చు. చదవడం, రాయడం రాదు. హీరోల్లో ఎవరెవరికి తెలుగు చదవడం రాయడం వచ్చో టాలీవుడ్ లో చాలా మందికి క్లారిటీ వుంది కానీ ఎవరూ నేరుగా చెప్పరు. స్టార్ హీరోల్లో టాప్ రేంజ్ లో వున్న ఓ నటుడు నిజాయితీగా తన తెలుగు గురించి చెబుతూ ఉంటారు. తనకు తెలుగు మాట్లాడడమే వచ్చని చదవడం రాయడం రాదని చాలా సందర్భాల్లో చెప్పారు. తెలుగు విషయంలో టాలీవుడ్ తీరును పవన్ కళ్యాణ్ సూటిగానే విమర్శించారు. ఇందులో ఇతర హీరోల ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. అందుకే టాలీవుడ్ లో ఈ విమర్శల హాట్ టాపిక్ అయ్యాయి. ఎన్నికల ప్రచార సమయంలో కొంత మంది టాలీవుడ్ నటులు పవన్ పై ఘాటు విమర్శలు చేశారు. వారిని మళ్లీ వైసీపీ తెరమీదక తెచ్చే అవకాశం ఉందటున్నారు. మరోవైపు ఏ పార్టీలతో సంబంధం లేని వారు మాత్రం ఈ విషయం పై స్పందించకపోతేనే బెటర్ అని అనుకుంటున్నట్లు చెప్తున్నారు.