కరోనా నుంచి కోలుకుంటున్నా.. సెకండ్ వేవ్ తో జాగ్రత్త

కరోనా సోకడంతో చికిత్స తీసుకుంటున్న పవర్ స్టార్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్  పార్టీ నేతలు, అభిమానులకు మెసెజ్ ఇచ్చారు. కరోనా నుంచి తన ఆరోగ్యం కుదుట పడుతోందని, త్వరగా కోలుకుని ప్రజల ముందుకు వస్తానని చెప్పారు. వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తున్నట్లు తెలిపారు పవన్ కల్యాణ్. తాను కరోనా బారిన పడ్డానని తెలిసినప్పటి నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతుడిని కావాలని అందరూ ఆశించారు, వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ నేతలు, జనసైనికులు, అభిమానులు తాను ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధనలు చేశారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మీ ముందకు వచ్చి ప్రజల కోసం నిలబడతానని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితిపై ప్రభుత్వ తీరును తప్పు పట్టారు వకీల్ సాబ్. ఏపీలో కరోనా బారిన పడినవారికి ఆసుపత్రుల్లో పడకలు, ఔషధాలు, ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోవడం దురదృష్టకమని విమర్శించారు. బెడ్స్ కొరతతో కరోనా రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడంలేదని, చికిత్సలో ఉపయోగించే మందుల కొరత ఏర్పడిందని వివరించారు. పరిస్ధితిని అంచనా వేయకపోవటం వలనే ఇటువంటి ఆందోళనకర పరిస్ధితి వచ్చిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. 

కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఏపీలో 7 వేలు, తెలంగాణలో 4 వేలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయని, ఈ కష్టకాలంలో ప్రభుత్వాలు మరింత సన్నద్ధతతో వ్యవహరించాలని పేర్కొన్నారు. కరోనా సోకడంతో పవన్ కల్యాణ్ కు ఉపిరితిత్తుల్లో స్వల్ప ఇన్ ఫెక్షన్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఫాంహౌజ్ లోనే ప్రత్యేక డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోంది.