పవన్ మోదీని కలవడం ఆశ్చర్యం: చిరు

 

 

 

పవన్ కళ్యాణ్ బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోదీని కలిసి మద్దతు తెలపడంపై ఆయన సోదరుడు, కాంగ్రెస్ కేంద్రమంత్రి చిరంజీవి తప్పుపట్టారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... జన పార్టీ ఆవిర్భావ సభలో తాను లౌకిక వాదిని అని చెప్పిన పవన్ కళ్యాణ్, మతత్వ పార్టీ నాయకుడైన మోదీని కలవడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో గోద్రా నరమేధంలో ఇప్పటికీ మోడీ పాత్రపై ఆరోపణలున్నాయని చిరంజీవి చెప్పారు. ఈ విషయంపై పవన్ కు అవగాహన ఉందో లేదో తెలియదని ఆయన తెలిపారు. మరోవైపు విభజనకు అనుకూలమని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత అన్ని పార్టీలు మాట మార్చాయని ఆరోపించారు. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళతామని చిరంజీవి చెప్పారు. కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు ఇతర పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. నాయకులు పార్టీని వీడినా..కార్యకర్తలు తమ వెంటే వున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేందుకు 13 జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు.