బీజేపీతో పెరుగుతున్న జగన్ మైత్రి- పవన్ ఒంటరవుతున్నారా?

కేంద్ర, రాష్ట్రాల్లో అధికార పార్టీలుగా ఉన్న బీజేపీ- వైసీపీ చెలిమి అనివార్యమవుతున్న తరుణంలో కాషాయ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒంటరవుతున్నట్లే కనిపిస్తోంది. బీజేపీతో పొత్తు ప్రకటన తర్వాత ఇరు పార్టీల మధ్య సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినా అది ఇప్పటివరకూ సాధ్యం కాలేదు. ఈ కమిటీలో ఎవరుండాలనే దానిపై ఏకాభిప్రాయ కుదరకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఆలోపే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ జరగడం, మండలి రద్దు సహా పలు కీలక అంశాలపై హామీ లభించడం చకచకా జరిగిపోయాయి. దీంతో త్వరలో కేంద్ర కేబినెట్ లో వైసీపీ చేరికపై ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అప్పటి నుంచి జనసేన పరిస్ధితి ఇబ్బందికరంగా తయారైంది.

2014 ఎన్నికలకు ముందు టీడీపీతో కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ సార్వత్రిక పోరులో మాత్రం ప్రత్యక్షంగా బరిలోకి దిగలేకపోయింది. సంస్ధాగతంగా బలంగా లేకపోవడం, పార్టీ కమిటీల ఏర్పాటు కూడా జరగకపోవడం, అభ్యర్దుల ఎంపికకు తగినంత సమయం లేకపోవడం వంటి కారణాలతో 2014 ఎన్నికల్లో జనసేన కేవలం టీడీపీ, బీజేపీలకు మద్దతివ్వడంతోనే సరిపెట్టింది. ఆ తర్వాత మారిన పరిస్దితుల్లో 2018లో ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి వచ్చాక అదే బాటలో బీజేపీపై యుద్ధం ప్రకటించిన పవన్... రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ బీజేపీని దు‌మ్మెత్తి పోశారు. టీడీపీ బాటలోనే ఎన్డీయేకు గుడ్ బై చెప్పినా 2019 సార్వత్రిక ఎన్నికల్లో నేరుగా పోరాడే పరిస్దితి జనసేనకు లేకపోయింది. దీనికి తోడు జనసేన కూడా టీడీపీకి పరోక్షంగా సహకరిస్తుందనే భావన ఓటర్లలో రావడంతో ఇరు పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆ ఎన్నికలు ముగిశాయో లేదో టీడీపీ కంటే ముందే వైసీపీపై పోరుకు సిద్ధమైపోయిన జనసేనాని పవన్ అతి కొత్తి సమయంలోనే మళ్లీ బీజేపీ గడపతొక్కారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశాక విజయవాడలో ఇరుపార్టీల పొత్తును ప్రకటించారు. పొత్తు ప్రకటన అయితే వచ్చింది కానీ ఇరు పార్టీలు కలిసి క్షేత్రస్ధాయిలో ఉమ్మడిగా పోరాటాలు చేసింది లేదు. అమరావతి సహా కీలక అంశాలపై ఇరు పార్టీలదీ ఇప్పటికీ ఒంటరి పోరాటమే.

తాజాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిశాక ఎన్డీయేలో వైసీపీ చేరిక ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే వీటిపై పూర్తిగా క్లారిటీ లేకపోయినా త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో వైసీపీ కేంద్రంలో చేరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం మాత్రం సాగుతోంది. దీనికి బీజేపీ వైపు నుంచి ఫుల్ స్టాప్ పడకపోవడంతో ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ పరిస్ధితి నానాటికీ ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో పరిస్ధితిని గమనించిన పవన్ తానే చొరవ తీసుకుని బీజేపీ వైసీపీతో పొత్తు పెట్టుకుంటే తాను కాషాయ పార్టీతో పొత్తుకు గుడ్ బై చెబుతానని ప్రకటించారు. ఆ తర్వాత కూడా కర్నూలులో సుగాలి ప్రీతి కేసుపై సీబీఐ విచారణ కోరుతూ ధర్నా కూడా చేశారు. ఇందులో బీజేపీ నేతలెవరూ పాల్గొనలేదు. ఓవైపు వైసీపీతో చెలిమిపై బీజేపీ పెద్దల నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం, క్షేత్రస్ధాయిలో బీజేపీ నేతలు తన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వకపోవడం చూస్తే జనసేనాని ఒంటరవుతున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అందుకే భవిష్యత్ పరిణామాలను ఊహించే పవన్ రాష్ట్రంలో తాను చేపట్టే కార్యక్రమాలకు బీజేపీని ఆహ్వానించడం లేదని అర్దమవుతోంది. ఇదే పరిస్ధితి కొనసాగితే వైసీపీ కేంద్ర కేబినెట్ లో చేరకముందే బీజేపీతో పవన్ చెలిమి మూన్నాళ్ల ముచ్చట అవుతుందా అన్న వాదన వినిపిస్తోంది.