నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా? చిల్లరగా మాట్లాడొద్దని పవన్ ఫైర్

 

సీఎం జగన్మోహన్ రెడ్డికి జనసేనాని పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతల మాటల్ని భరించడానికి తాము టీడీపీ కాదని... జనసేన అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తన గురించి మాట్లాడితే మూడు పెళ్లిళ్లు అంటున్నారని... కావాలంటే మీరు కూడా చేసుకోండి... ఎవరు వద్దన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా, తాను మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి రెండేళ్లు జైల్లో ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. తాము ప్రజాసమస్యలను ప్రస్తావిస్తుంటే... సీఎం జగన్ మాత్రం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఘాటుగా రియాక్టయ్యారు. అయితే, తాను టీడీపీ నేతల్లా చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. తాము విధానాలపైనే మాట్లాడుతాం కానీ... వ్యక్తిగతంగా కాదన్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పవన్ తప్పుబట్టారు. వెంకయ్య గురించి అలా మాట్లాడేందుకు సిగ్గు ఉండాలన్నారు. వెంకయ్యనాయుడు హోదాను కూడా గుర్తించకుండా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తారా మండిపడ్డారు. ఇంగ్లీష్‌ మీడియం మీద అంత ప్రేమ ఉంటే... తిరుమలలో సుప్రభాతాన్ని కూడా ఇంగ్లీష్‌లో చదివించాలన్నారు. జగన్... ఫ్యాక్షనిస్టు ధోరణితో మాట్లాడుతున్నారని, జగన్ బెదిరింపులకు తాను భయపడనని అన్నారు. ఆంధ్రప్రదేశ్... భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిందన్న విషయం అసలు జగన్ కు తెలుసా అంటూ ప్రశ్నించారు. తమిళనాడులో ఇంకా తెలుగు మీడియం ఉందనే సంగతి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలనే... వైసీపీ సర్కారు కూడా చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలనే తాము ప్రశ్నిస్తున్నామని, తప్పులు ఉంటే సరిచేసుకోవాలన్నారు. హిందీని జాతీయ భాషగా చేస్తామన్న ప్రకటనపై పలు రాష్ట్రాలు తీవ్రంగా స్పందించడంతో కేంద్రం వెనక్కి తగ్గి దిద్దుబాటు చర్యలు తీసుకుందన్న జనసేనాని... తాము ప్రశ్నిస్తే అందులో తప్పేముందన్నారు.

ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్... దీనిపై ఎవరికీ సందేహం లేదు... కానీ తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడకూడదనే తాము స్పందించామని అన్నారు. అయినా, టీచర్లకు ఆంగ్లంతో ప్రావీణ్యం కల్పించకుండా ఒకేసారి మారిస్తే ఎలా అన్నారు. టీచర్లు ఎప్పుడు ఇంగ్లీష్ లో శిక్షణ పొందుతారు... పిల్లలకు ఎప్పుడు చెబుతారని ప్రశ్నించారు. అయినా, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చిల్లరగా మాట్లాడటం సరికాదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ వైసీపీ అధినేతగా మాట్లాడుతున్నారని, ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోవద్దని, ఒక సీఎంలా మాట్లాడాలని సూచించారు.