లోకేష్ కి కౌంటర్ ఇవ్వబోయి పప్పులో కాలేసిన పవన్

 

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం వంతాడలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, దీన్ని అడ్డుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. అయితే దీనిపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ‘మోడీ దత్త పుత్రుడి అబద్ధపు ప్రచారం. అవినీతి అని గగ్గోలు పెట్టారు. నిరూపించమంటే ప్యాకప్ అన్నారు. ఇప్పుడు మరో సారి బాక్సైట్ మసి పూసే ప్రయత్నం చేస్తున్నారు. పదవి కోసం తప్పుడు ప్రచారం మాని ఆధారాలు ఉంటే బయటపెట్టమని సవాల్ చేస్తున్నా.’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. దీనికి కౌంటరివ్వాలన్న ఆవేశంలో పవన్ పప్పులో కాలేశారు. 'శ్రీ లోకేష్ గారు, శ్రీ చంద్రబాబునాయుడు గారికి ఆధారాలు కావాలట. అందుకే వంతాడకు సంబంధించి ఆంధ్ర మైనింగ్ కంపెనీపై జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నివేదికను నేను ఇక్కడ ఉంచుతున్నాను. దీంతో మీకు ఎలాంటి సంబంధం లేకపోతే దయచేసి దీనిపై విచారణ జరిపించి, బాధ్యులను శిక్షించండి’ అంటూ పవన్ ఆ రిపోర్ట్ ని జత చేసి ట్వీట్ చేసారు. ఇదే పవన్ కి పెద్ద తలనొప్పిగా మారింది. పవన్ సాక్ష్యం గా పోస్ట్ చేసిన సదరు ఆర్డర్ 2010లో ఇచ్చింది. అంటే ఎనిమిదేళ్ల క్రితం నాటిది. అప్పుడు అధికారంలో ఉన్నది వైఎస్ హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవానికి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015లో ఆ లీజును రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఇది తెలియక పవన్ పాత రిపోర్ట్ ని పోస్ట్ చేసి విమర్శలు మూట గట్టుకుంటున్నారు.