నావల్లే వైసీపీ గెలిచింది.. వాళ్లు నాకు చేతులెత్తి దండం పెట్టాలి: పవన్

 

పవన్ కళ్యాణ్ బీజేపీకి దగ్గరవుతున్నాడని, త్వరలో జనసేనని బీజేపీలో విలీనం చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడని.. వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై పవన్ స్పందించారు. తాజాగా ఆయన తిరుపతిలో మీడియాలో మాట్లాడుతూ.. అసలు తాను బీజేపీకి దూరంగా లేనని.. కలిసే ఉన్నానని స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా అంశంలోనే బీజేపీతో విభేదించానని అన్నారు. అసలు ఆ మాటకొస్తే.. వైసీపీ వాళ్లు నాకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలన్నారు. ఎందుకంటే.. నేను బీజేపీ, టీడీపీతో కలిసి మళ్లీ పోటీ చేసి ఉంటే వైసీపీ ఎక్కడ ఉండేది? అసలు వైసీపీ అధికారంలోకి వచ్చేదా? అని ప్రశ్నించారు. నేను విలువలకు కట్టుబడి ఒంటరిగా పోటీ చేశాను అని చెప్పుకొచ్చారు. వైసీపీకి అమిత్ షా అంటే భయం.. కానీ నాకు ఆయనంటే గౌరవం.. అందుకే వైసీపీ వాళ్లకి విమర్శలు చేయడం తప్ప.. ఇంకేం తెలియదని పవన్ విమర్శించారు.

గత ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించడంతోనే వైసీపీ ప్రభుత్వం సమయం వృధా చేస్తోందని విమర్శించారు. మాజీ సీఎం ఇల్లు కూల్చివేతపై ఉన్న శ్రద్ధ సమస్యలపై లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి సామాన్యుడి కష్టాలు పట్టవా? అని ప్రశ్నించారు. కియా పరిశ్రమ సీఈవోను వైసీపీ నేతలు బెదిరించారు.. ఇక రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయి అని నిలదీశారు. ఇంగ్లీష్‌ మీడియం అవసరమే.. కానీ అసలు తెలుగుమీడియం లేకుండా చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. తెలుగు మీడియం తీసేసినట్టుగా.. ఉర్దూ మీడియం కూడా తీసేసి ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రోత్సహించగలరా? అని నిలదీశారు. తెలుగు భాషను పరిరక్షించమంటే వైసీపీ వక్రీకరిస్తోందని పవన్ మండిపడ్డారు.