కాబోయే కేంద్ర మంత్రి పవన్?

 

 

 

పవన్ కళ్యాణ్ చూడ్డానికి ఆవేశపరుడిలా కనిపిస్తాడుగానీ, లోపల చాలా ఆలోచన వుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాజకీయాల్లో తాను వెళ్ళాల్సిన రూట్‌లో కచ్చితంగా వెళ్తున్నాడని అభినందిస్తున్నారు. రాజకీయాల విషయంలో తన అన్న చిరంజీవిలా అపరిపక్వత, ఆలోచనాలేమిని ప్రదర్శించకుండా చాలా తెలివిగా అడుగులు వేస్తున్నాడని కితాబు ఇస్తున్నారు. బీజేపీకి చేరువై భవిష్యత్తులో తన అన్నలాగా కేంద్ర మంత్రి అవ్వాలన్న లక్ష్యానికి పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా చేరువవుతున్నాడని ప్రశంసిస్తున్నారు.

 

‘జనసేన’ పార్టీని ప్రకటించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలోని సారాంశాన్ని పక్కన పెడితే, చివర్లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన నినాదం బీజేపీకి చేరువ కావడానికి ఉద్దేశించిందేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రసంగమంతా తెలుగులో చేసిన పవన్, చివర్లో ‘కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో’ అని హిందీలో నినదించడం వెనుక కూడా వ్యూహం వుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి తరిమికొట్టాలన్నది బీజేపీ విధానం. ఆ విధానాన్నే బీజేపీ అగ్ర నాయకత్వానికి అర్థమయ్యేలా హిందీలో నినదించడం ద్వారా పవన్ బీజేపీ అధిష్టానంలో మార్కులు సంపాదించేశాడు.

పార్టీని ఇలా ప్రకటించాడో లేదో అలా బీజేపీ నాయకుడు, ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నుంచి పవన్ కళ్యాణ్‌కి పిలుపొచ్చింది. గుజరాత్‌కి వెళ్ళి మోడీని కలిసొచ్చిన పవన్ కళ్యాణ్ తన మద్దతు బీజేపీకి వుంటుందని, కాబోయే ప్రధానమంత్రి నరేంద్రమోడీయేనని తేల్చి చెప్పేశాడు. టోటల్‌గా ఈ మేటర్ మొత్తన్నీ పరిశీలిస్తున్న రాజకీయ పరిశీలకులు నరేంద్రమోడీ, పవన్ కళ్యాణ్ మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒప్పందం కుదిరిందని భావిస్తున్నారు.

ఆంధప్రదేశ్‌లో అంతంతమాత్రంగా వున్న బీజేపీకి పవన్ కళ్యాణ్ తన మద్దతు ఇచ్చి ఎక్కువ సీట్లు వచ్చేలా చేయాలి. దీనికి ప్రతిఫలంగా బీజేపీ అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్‌కి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేసి కేంద్ర మంత్రి పదవిని అప్పగిస్తుంది. మొత్తానికి పవన్ పెద్ద ప్లానే వేశాడు. తన అన్న చిరంజీవి జనాల్లో వున్న పరువంతా పోగొట్టుకుని, పార్టీ పెట్టి భంగపడి సంపాదించిన కేంద్రమంత్రి పదవిని పవన్ కళ్యాణ్ చాలా ఈజీగా సంపాదించే మార్గంలో వెళ్తున్నాడని పరిశీలకులు అంటున్నారు.