మోడీకి జై కొట్టిన పవన్ కళ్యాణ్

 

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు అహ్మదాబాద్ వెళ్లి బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీని కలిసారు. దాదాపు గంటసేపు సాగిన వారి సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ తన జనసేన పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. వారిరువురూ రాష్ట్ర రాజకీయాలు, విభజన జరిగిన తీరు గురించి చర్చించుకొన్నట్లు తెలిపారు.

 

పవన్ కళ్యాణ్ తాను అధికారం కోసం రావడం లేదని ముందే స్పష్టం చేస్తున్నందున, ఆయన వలన బీజేపీకి లాభమే తప్ప నష్టమేమి ఉండదు. ఆయన మద్దతుతో ఆంధ్రా, తెలంగాణా రెండు ప్రాంతాలలో కూడా బీజేపీకి చాలా లాభం చేకూరుతుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు తెలంగాణాలో కూడా చాలా మంది అభిమానులున్నపటికీ, వారిలో చాలా మంది చిరంజీవి తెలంగాణా వ్యతిరేఖ ధోరణి వలన ఆయనకి దూరమయ్యారు. అయితే నేటికీ వారిలో చాలా మంది పవన్ కళ్యాణ్ పట్ల అభిమానం చూపుతూనే ఉన్నారు. గనుక పవన్ కళ్యాణ్ మద్దతు బీజేపీకి కలిసి వచ్చే అంశంగా మారుతుంది. ఇక సీమాంద్రాలో పవన్ కళ్యాణ్ అభిమానులకి ఆయన మాటే వేద వాక్కు గనుక అక్కడ కూడా బీజీపీ లాభపడుతుంది.

 

పవన్ కళ్యాణ్ బీజేపీ వైపు మ్రోగ్గు చూపినందున, ఇంతవరకు సీమాంద్రా ప్రజలలో ఆ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేఖత కూడా కొంత తగ్గుముఖం పట్టవచ్చును. గనుక తెదేపా-బీజేపీల మధ్య ఎన్నికల పొత్తులకు మార్గం సుగమం అవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉన్నట్లు సూచించారు గనుక ఇక ఈ మూడు పార్టీలు చేతులు కలపడం తధ్యం. దీనితో ఇంతవరకు ఆంద్ర, తెలంగాణాలలో రాజకీయ పార్టీల బలాబలాలలో తీవ్ర అంతరం ఏర్పడుతుంది కూడా.

 

ఇంతవరకు సీమాంద్రాలో తెదేపా-వైకాపాలు రెండూ సమవుజ్జీలుగా నిలుస్తూవచ్చాయి. కానీ, ఇప్పుడు శక్తివంతులయిన, ప్రజలను ప్రభావితం చేయగల ముగ్గురు వ్యక్తులు-చంద్రబాబు, నరేంద్రమోడీ, పవన్ కళ్యాణ్ చేతులు కలిపినట్లయితే, జగన్మోహన్ రెడ్డి వారిని తట్టుకొని విజయం సాధించడం దాదాపు అసంభవమవుతుంది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేఖత ఉన్నందున, అతనికీ కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య ఉన్న రహస్య అవగాహన కూడా వైకాపాకు ఒక ప్రతిబందకంగా మారవచ్చును.

 

మోడీ, చంద్రబాబు ఇరువురూ మంచి పరిపాలనా దక్షులు, రాజకీయ అనుభవజ్ఞులు కాగా, జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పాలనానుభవం లేకపోగా అతని నేర చరిత్ర, సీబీఐ,ఈడీ కేసులు ఆయన పార్టీకి శాపంగా మారే అవకాశం ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డికి కూడా మంచి ప్రజాధారణ ఉన్నపటికీ, అది పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ కాదు. ఎందువలన అంటే పవన్ కళ్యాణ్ తన ఉన్నత వ్యక్తిత్వంతో, తన సినిమాల ద్వారా ప్రజాధారణ పొందితే, జగన్ మాత్రం చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకొంటున్నట్లుగా నేటికీ తన తండ్రి వైయస్సార్ మరణం తాలూకు సానుభూతి ద్వారానే ప్రజాధారణ పొందే ప్రయత్నం చేయడమే అందుకు కారణం. ఇక దేశ వ్యాప్తంగా వీస్తున్న మోడీ ప్రభంజనం, చంద్రబాబు, మోడీలమధ్య ఉన్న సత్సంభందాలు వగైరా అంశాలు కూడా ఈ కూటమికి వైకాపాపై స్పష్టమయిన ఆధిక్యత ఏర్పరచవచ్చును.

అయితే తెలంగాణాలో పవన్ కళ్యాణ్ ప్రభావం అంతంత మాత్రమే గనుక ఆయన బీజేపీకి మద్దతు ప్రకటించినా పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చును. కానీ ఆయన మద్దతు వలన తెదేపా, బీజేపీలకు ఎంతో కొంత లాభమే తప్ప నష్టం మాత్రం జరగదని చెప్పవచ్చును. కానీ, ఈ మూడు పార్టీలు ఒకబలమయిన కూటమిగా ఏర్పడి వేర్వేరుగా పోటీ చేస్తున్న కాంగ్రెస్, తెరాసల విజయావకాశాలకు తప్పకుండా గండి కొట్టగలవు.