పవన్, మోడీ,బాబు చేతులు కలిపితే...

 

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్తాపిస్తున్నట్లు ప్రకటించగానే దేనినయినా రాజకీయ రంగు కళ్ళద్దాలలో నుండి మాత్రమే చూసేందుకు బాగా అలవాటు పడిపోయిన అనేకమంది రాజకీయ విశ్లేషకులు ఎన్నికల తరువాత పవన్ స్థాపించిన జనసేన కూడా చిరంజీవి యొక్క ప్రజారాజ్యంలాగే కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతుందని నిర్దారించేసారు. వారేగాక సీపీయం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు కూడా అదేవిధంగా అభిప్రాయపడ్డారు. కానీ వారందరి ఊహాగానాలను వమ్ము చేస్తూ పవన్ కళ్యాణ్ ఈరోజు బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీని కలవబోతున్నారు. పవన్ కళ్యాణ్ లాగే నరేంద్ర మోడీ కూడా కాంగ్రెస్ పార్టీని దేశం నుండి పూర్తిగా తుడిచిపెట్టేయాలని పట్టుదలగా ఉన్నారు. అటువంటి వ్యక్తితో, పార్టీతో పవన్ కళ్యాణ్ చేతులు కలపాలనుకోవడం చూస్తే పవన్ జనసేనను, చిరంజీవి ప్రజారాజ్యంతో పోల్చలేమని, అదేవిధంగా ఆ అన్నదమ్ముల ఆలోచనా సరళిలో చాలా వైర్ద్యం ఉందని స్పష్టమవుతోంది.

 

చిరంజీవి తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి, తనను, తన ప్రజారాజ్యాన్నినమ్ముకొన్న వారినందరినీ నట్టేట ముంచి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయి, సోనియాగాందీ ముందు సాగిలపడి తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తే, పవన్ కళ్యాణ్ ఆయనకు పూర్తి విరుద్దంగా తనకసలు ఏ పదవి మీద వ్యామోహం లేదని అసలు ఎన్నికలలో పోటీ చేస్తానో లేదో కూడా చెప్పలేనని ప్రకటించారు. ప్రాంతాలుగా విడిపోయిన తెలుగు ప్రజలందరూ సక్యతతో మెలగాలని పిలుపునిచ్చారు. ఆయన తన ప్రసంగంలో విభజన రాజకీయాలను ఎండగట్టి, అందుకు కారకురాలయిన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేస్తానని శపథం చేయడమే కాకుండా, తన ఆలోచనలకు అనుగుణంగా ఈ రోజు బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీని కలవనున్నారు.

 

మూలిగే ముసలి నక్క వంటి కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా దానిని గెలిపించే బాద్య భుజానికెత్తుకొన్నఆయన సోదరుడు చిరంజీవికి ఇది మరొక పెద్ద షాక్ అని చెప్పవచ్చును. తెదేపా-బీజేపీలు ఎన్నికల పొత్తుల గురించి ఆలోచిస్తున్న ఈ తరుణంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా వారికి తోడయితే, వారి కూటమి ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో ఒక తిరుగులేని శక్తిగా అవతరించడం ఖాయం. నరేంద్రమోడీ, చంద్రబాబులకు వారి కార్యదక్షత, సమర్ధ పరిపాలనానుభావం అనుకూలాంశాలు అయితే, వారికి పవన్ కళ్యాణ్ కున్న అపారమయిన ప్రజాధారణ, స్టార్ ఇమేజ్ మరింత కలిసి వస్తుంది. వీరు ముగ్గురు చేతులు కలిపినట్లయితే, రాష్ట్ర రాజకీయాలలో మళ్ళీ సమీకరణాలు మారినా ఆశ్చర్యం లేదు. అప్పుడు కొద్దో గొప్పో విజయావకాశాలు ఉన్నాయనుకొంటున్న తెలంగాణాలో కూడా ఇకపై కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు అభ్యర్ధులను వెతుకొనే దుస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదు. అప్పుడు కాంగ్రెస్ మళ్ళీ తెరాసతో పొత్తులకు గట్టిగా ప్రయత్నించవచ్చును. లేదా తనకు అలవాటయిన పద్దతిలో పవన్ కళ్యాణ్ పై కూడా ఆధాయపన్ను శాఖ తదితరులను ఉసిగొల్పినా ఆశ్చర్యం లేదు.