సీమాంధ్ర రాజకీయాలపై పవన్, కిరణ్ ఎఫెక్ట్

 

మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీ పేరు ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ అని తాజా సమాచారం. ఈ పేరుని శ్రీహరి రావు అనే వ్యక్తి కొన్ని నెలల క్రితమే ఎన్నికల కమీషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారు. ఇప్పుడు ఆ పార్టీ పేరుని కిరణ్ పేరిట బదలాయించినట్లు తెలుస్తోంది.

 

అయితే రాష్ట్రం ఆంధ్ర, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోతున్న ఈ తరుణంలో కూడా కిరణ్ తన పార్టీకి ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ అని పేరు ఎంచుకోవడం గమనిస్తే, ఆయన ప్రజలలో ఉన్న సమైక్య భావనలను, సెంటిమెంటుని వాడుకొనేందుకు సిద్దపడుతున్నట్లు స్పష్టమవుతోంది. అదీగాక ఆయన శాశ్విత ప్రాతిపాదికన రాజకీయపార్టీ ఏర్పాటు చేయదలచుకొంటే వేరే మరేదయినా పేరుని ఎంచుకొని ఉండేవారు. కానీ, ఈ సమైక్యభావనలు ఎల్లకాలం ఉండబోవని, ప్రజలలో సమైక్యవేడి క్రమంగా చల్లారుతున్నదని తెలిసినప్పటికీ, ఆయన ఇటువంటి పేరుని ఎంచుకోవడం చూస్తే ఆయన తాత్కాలికంగానే ఈ పార్టీని నెలకొల్పుతున్నారని అర్ధమవుతోంది. అంటే ఎన్నికల తరువాత ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవడం ఖాయమని భావించవచ్చును.

 

అయితే మరి కేవలం రెండు మూడు నెలల కోసం ఇంత భారీ ఖర్చు చేసి, ఇంత శ్రమపడి పార్టీని ఎందుకు స్థాపిస్తున్నారు అంటే ఎన్నికలలో ఓట్లు చీల్చి కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువయిన తెదేపాను రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం, వీలయితే తన అధిష్టానం కోసం తన వంతుగా మరి కొన్ని యంపీ సీట్లు సాధించిపెట్టడానికేనని చెప్పుకోవచ్చును. అయితే ఆయన ప్రధానంగా తెదేపాకు నష్టం కలిగించాలని పార్టీ పెడుతున్నపటికీ, ఆయన వల్ల తెదేపా కంటే కాంగ్రెస్ అధిష్టానం తో రహస్య అవగాహన కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే వారిరువురూ కూడా తెలుగువారి ఆత్మగౌరవం, సమైక్యవాదం కోసం తామే పోరాడుతున్నామని చెప్పుకొంటూ ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు గనుక వారి మధ్య ప్రజల ఓట్లు చీలిపోవచ్చును. అదేవిధంగా ఇద్దరు కూడా రెడ్డి కులస్తులే గనుక ఆ కులస్థుల ఓట్లు కూడా వారిరువురి మధ్య చీలిపోయే అవకాశం ఉంది. కానీ, మిగిలిన పార్టీలలో టికెట్స్ దొరకని అసంతృప్తి నేతలందరూ చివరికి కిరణ్ కుమార్ గూటికే చేరుకొనే అవకాశం ఉంది గనుక ఈ రెండు నెలల సమయంలో కిరణ్ పార్టీ మరింత బలపడితే అప్పుడు ఆయన పార్టీ వల్ల తెదేపాకు కూడా నష్టం తప్పకపోవచ్చును.

 

ఇక కమ్మ, కాపు, యస్సీ యస్టీ, బీసీ మరియు ఇతర కులస్థులు, మైనార్టీ వర్గాల ఓట్లు ప్రధానంగా తెదేపా, కాంగ్రెస్ పార్టీల మధ్యే చీలవచ్చును. కానీ, రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నవారందరూ తెదేపా వైపే చూసే అవకాశం ఉంది. కానీ, ఒకవేళ తెదేపా బీజేపీతో పొత్తులు పెట్టుకొన్నట్లయితే, జగన్ మజ్లిస్ పార్టీతో చేతులు కలిపి మైనార్టీ వర్గాలను తనవైపు తిప్పుకొన్నట్లయితే, పోటీ చాలా తీవ్రతరం అవుతుంది. ఇప్పుడు వీరందరి నడుమ పవన్ కళ్యాణ్ కూడా పోటీలోకి ప్రవేశిస్తుండటంతో, అతని ప్రభావంతో ముందుగా కాంగ్రెస్, ఆ తరువాత వరుసగా తెదేపా, వైకాపా, కిరణ్ పార్టీలు కూడా కొంత మేర నష్టపోయే అవకాశం ఉండవచ్చును. అయితే, ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ మారే రాజకీయ సమీకరణాలు, పార్టీల వ్యూహాల కారణంగా ఈ అంచనాలు కూడా మారిపోవచ్చును.