పవ"నిజమేనా"?

 

నిజం నిప్పులో కాలదు. నీటిలో నానదు. ఇజం మాత్రం ఎందులోనైనా ఇమిడిపోతుంది. నక్సలిజం, టెర్రరిజం, హీరోయిజం, విలనిజం ఇలా అవకాశం ఆసరాగా.. అవసరాలకు అనుగుణంగా ఇజం రూపుదిద్దుకుంటుంది. ఈ ఇజం లేకుండా పవనిజం అంతర్జాలాన్ని ఎలా ఆక్రమించింది? ఏ అదృశ్య శక్తి దీన్ని నడుపుతోంది? వీటన్నింటికి సమాధానమే పవన్ పొలిటికల్ ఎంట్రీ కథనాలు. నెటిజన్ల ద్వారా సామాన్య జనానికి వ్యాపించిన పవనిజం..హిప్నాటిజంలా మైమరిపిస్తోంది. పవనిజంపై పుస్తకాలు వచ్చాయి. ప్రత్యేక సంచికలు వెలువడ్డాయి. పవన్ అనే వ్యక్తిని అత్యంత ప్రభావవంతమైన శక్తిలా మార్చేందుకు తెర వెనుక మేధావులు చేస్తున్న మేదోమధనమే ఈ పవనిజమా? అనే సందేహాలు రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న.. అనిపించుకున్న పవన్ చేతులు.. ఎందరికో చేయూతనిచ్చాయి.

 

ఒట్టి మాటలు కట్టి పెట్టి.. గట్టి మేల్ తలపెట్టవోయ్ అని వందేళ్ళ క్రితం గురజాడ చూపిన అడుగుజాడలో పయనించిన పవన్.. పావలా శ్యామల ఆరోగ్యం కోసం ఆర్ధిక సాయమందించాడు. ఉత్తరాఖండ్ ఉపద్రవానికి చలించిపోయి అందరి కంటే ముందుగా స్పందించి రూ. 25లక్షలు అక్కడి ప్రభుత్వానికి పంపాడు. అన్న కొడుకుతో ఆరెంజ్ అనే సినిమా తీసి ఓ రేంజ్ లో నష్టపోయిన నాగబాబును ఆర్థికంగా ఆదుకున్నాడు. ఈ విషయం నాగబాబు చెబితేనే అందరికీ తెలిసింది. గుప్తదానాలు, ఆప్తులను ఆదుకోవడాలు, ఆపద్ధర్మ సహాయాలు మీడియా ద్వారా బయటి ప్రపంచానికి తెలిసిపోయాయి. ప్రచారానికి, ప్రసంగాలకు పవన్ దూరంగా ఉంటారు. తన సినిమా ఆడియో విడుదల వేడుకకు కూడా హాజరు కారు. తన సినిమాలకు అర్థ శతదినోత్సవాలు, శత దినోత్సవాలను ఘనంగా జరిపేందుకు ఇష్టపడరు. ఇదంతా గతం..ప్రస్తుతం .. సినిమా వేడుకలైనా.. స్వచ్చంద కార్యక్రమాలైనా ..ఆహ్వానిస్తే తప్పకుండా హాజరవుతున్నారు ;పవన్. భావోద్వేగపూరిత, ఉద్రిక్తతలు రెచ్చగొట్టే తన ప్రసంగాల శైలినీ మార్చేశారు.

 

పవన్ ఎందుకు ఇంతలా మారిపోయాడో విశ్లేషించే పనిలో సినీ పండితులు, రాజకీయ విశ్లేషకులు తల మునకలయ్యారు. ఇదే సమయంలో పవనిజం చాప కింద నీరులా విస్తరించింది. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను పవర్ స్టార్ ఇమేజ్ తో సొమ్ము చేసుకోవచ్చని, పవనిజం కూడా ప్రాంతాలకు అతీతంగా ఓట్లు కురుపిస్తుందని పవన్ ను ఒప్పించి పూర్తి స్థాయిలో రాజకీయాల తెరపైకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారనే వాదన వినిపిస్తోంది.

 

మరో పక్క ఎన్నో ఆశలతో, మరెంతో నమ్మకంతో తన అన్న చిరంజీవి వెంట వెళితే పదవులే లక్ష్యమ్.. విలీనమే మార్గంగా కాంగ్రెస్ లో ప్రజరాజ్యాన్ని కలిపేయడం పవన్ ను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని అంటున్నారు గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన నాయకులు. అందుకే కొత్తగా పార్టీ పెట్టి తన సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారని చెబుతున్నారు.

 

వీటన్నిటి కంటే..వేరే బలమైన కారణమే పవన్ పొలిటికల్ ఎంట్రీకి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీల వ్యవహారశైలి, పదవులు వచ్చిన తరువాత కొంత మంది వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెందిన పవన్ చాలా రోజుల నుంచే పోలిటిక్స్ లోకి రావాలనుకుంటున్నారట.. అందుకే కోట్లాది మంది అభిమానుల గుండెల్లో కొలువైన ఆరాధ్య నటుడు .. అభిమాన నాయకుడిగా మార్చే వ్యూహంతో పవన్ కోటరీ పవనిజంతో అభిమానుల నెట్ ఇంట్లో అడుగు పెట్టిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. పవన్ కోరుకుంటే పదవులు పరిగెత్తుకుంటూ వచ్చి ఫాం హౌస్ ముందు మొకరిల్లుతాయి. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా ఒక్క సీటు అడిగితే ఓపెన్ ఆఫర్ ఇచ్చే పార్టీలు ఉన్నాయి. పవన్ కోరుకుంటే జరగని పనిలేదు. పవన్ ఒక పవర్.

 

అలాగని పొలిటికల్ పవర్ కావాలనుకుంటే.. పవనిజం ఒక్కటే చాలదు. అన్న మోసగించినా మోములో చిరు నవ్వు చెదరకూడదు. వ్యక్తిగత జీవితంపై విమర్శలు వెల్లువెత్తినా వీధిన పడకూడదు. ఇన్ని భావోద్వేగాలను అదుపు చేసుకుంటే పవనిజం.. నిజమయ్యే ఛాన్స్ ఉంది.

 

సినిమాలోలా .. రాజకీయాల్లో నీ మాటలు నువ్వే రాసుకోవాలి.. పాటలు నువ్వే పాడుకోవాలి.. అక్కడ ఒకేసారి కొడితే వందమందిని పడతారు.. ఇక్కడ ఒక్క మాటన్న తిరగబడతారు.. రీటేక్ , రీషూట్ లు ఉండవు. యాక్షన్ సీనులో డూప్ లు అసలే ఉండరు. అంతా నా ఇష్టం! అని ఒకరికి విడాకులు ఇవ్వకుండా.. విశాల దృక్పధంతో సహజీవనానికి సిద్ధపడితే ప్రతిపక్షాలు ఎన్నికల్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాయి. అదే నిజమైతే ఎన్నో కలలుగన్న ఎన్నికల రంగం నుంచి తప్పించనూ వచ్చు.. సినీమాయా ప్రపంచం నుంచి బయట పడితే.. పవనిజం.. నిజమే ఐతే.. ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది.