ఆంధ్రోళ్లు అని తిట్టవద్దు: పవన్

 

పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ “ముఖ్యమంత్రులిరువురూ బాధ్యతగా వ్యవహరించాలి. అదే విధంగా మాట్లాడేటప్పుడు కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం మంచిది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీష్ రావు తరచూ ‘ఆంధ్రోళ్లు’ ‘సెటిలర్స్’ అని చాలా అవమానకరంగా మాట్లాడుతుంటారు. ఒకవేళ వారు చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి తిట్టుకోదలిస్తే నేరుగా ఆయన పేరు పెట్టి తిట్టుకోవచ్చును. లేదా ఆయన కులాన్ని తిట్ట దలిస్తే నేరుగా వారినే తిట్టుకోవచ్చును. కావాలనుకొంటే నన్ను కూడా తిట్టుకోండి. మరేమీ పరువాలేదు. కానీ ఆంధ్రోళ్లు అంటే చంద్రబాబు నాయుడని కానీ తెదేపాకు చెందిన వారు కారని కాదని సంగతి గ్రహించాలి. ఆంధ్రాలో ఉండే అనేక కులాలు, మతాలు, వర్గాలకు చెందిన ప్రజలందరూ కలిస్తే ఆంధ్రావాళ్ళు అవుతారు తప్ప ఏదో ఒక కులానికో రాజకీయ పార్టీకి చెందినవాళ్ళు మాత్రమే ఆంధ్రావాళ్ళు కాదని గుర్తుంచుకోవాలి. వారు ఆవిధంగా నోటికి వచ్చినట్లు అదుపు లేకుండా మాట్లాడటం ఎవరికీ మంచిది కాదు. రాజకీయాలలో ఉన్నవాళ్ళకి నోటిపై, మాట్లాడే బాషాపై చాలా అదుపు అవసరం. కులాల గురించి మాట్లాడటం నాకసలు ఇష్టం లేదు. కానీ రాజకీయాలలోకి వచ్చిన తరువాత తప్పనిసరిగా మాట్లాడవలసి వస్తోంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈవిధంగా వ్యవహరించడం వలన ప్రజల మధ్య ఇంకా చిచ్చుపెట్టినట్లవుతుంది. మొన్న నాగార్జున సాగర్ వద్ద ఇరు రాష్ట్రాల పోలీసులు కొట్టుకోవడం చూసిన తరువాత నాకు ఈ పరిస్థితులుఅంతర్యుద్ధాలకి దారి తీస్తాయేమోననే భయం కలుగుతోంది. అటువంటి పరిస్థితి ఏర్పడకుండా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ విద్వేషాలను విడనాడి కలిసి పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది.