రేవంత్ రెడ్డి కేసుపై స్పందించను: పవన్

 

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొద్ది సేపటి క్రితం మీడియా సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య జరుగుతున్న గొడవల గురించి, ఇంకా అనేక ఇతర అంశాల గురించి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే: ఇరు రాష్ట్రాల మధ్య జరుగుతున్నా గొడవలన్నిటినీ నేను నిత్యం గమనిస్తూనే ఉన్నాను. వాటిపై నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. ఇంత జరుగుతున్నా నేను ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ యంపీ వీ. హనుమంత రావు గారు నన్ను నిలదీయాలనుకోవడం గురించి నాకు తెలుసు. కానీ మాట్లాడితే చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలనే ఉద్దేశ్యంతోనే నేను వెనక్కి తగ్గుతున్నాను.

 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు విజయనగరానికి చెందిన ఆనందసాయి అనే ఆర్కిటెక్ట్ ని నియమించి తెలుగు జాతి సమైక్యత అవసరమనే ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చేరు. అందుకు ఆయనకీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రేవంత్ రెడ్డి కేసుప్రస్తుతం కోర్టులో ఉంది కనుక దానిపై ఇప్పుడు నేను నా అభిప్రాయాలు చెప్పలేను. కానీ దానికి ముందు జరిగిన పరిణామాల గురించి మాట్లాడగలను. తెదేపా నేతలను తెరాసలోకి ఆకర్షించినందునే ఈ సమస్య మొదలయిందని నేను భావిస్తున్నాను. రాజకీయ నాయకులు తమ కంట్లో దూలాలు ఉంచుకొని ఎదుటవాడి కంట్లో నలుసుల గురించి మాట్లాడుతున్నారు.

 

రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలు తలెత్తాయి. వాటిని పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించకుండా ఈ విధమయిన అనవసరమయిన రాజకీయాలు చేయడం ఎవరికీ మంచిది కాదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ చాలా బాధ్యతగా వ్యవహరించుతూ ఈ సమస్యలను పరిష్కరించుకొనే ప్రయత్నం చేయాలి. ప్రజలు వారు తమ సమస్యలని తీర్చుతారనే ఉద్దేశ్యంతోనే వారిని ఎన్నుకొన్నారు. కానీ వారు ప్రజాసమస్యలను గాలికొదిలేసే ఇటువంటి సమస్యలు సృష్టించుకొని కోర్టులు, కేసులు అంటూ రోజులు దొర్లించేసినట్లయితే వారిని ఎన్నుకొన్న ప్రజలే వారికి తగిన గుణపాఠం నేర్పుతారు. తెదేపాకి చెందిన ప్రజా ప్రతినిధులను పార్టీలో చేర్చుకోగలరేమో గానీ వారితో బాటు ప్రజల అభిమానాన్ని ఓట్లను కూడా పోనగాలమని భావిస్తున్నారా?తలసాని శ్రీనివాస్ ని తెరాసలో చేర్చుకొన్నంత మాత్రాన్న హైదరాబాద్ లో స్థిరపడిన సీమాంధ్ర ప్రజలను ఆకర్షించగలరా?