వైకాపా హటావ్ సీమాంద్రా బచావ్: పవన్ కళ్యాణ్

 

బుదవారం సాయంత్రం తిరుపతిలో తెదేపా-బీజేపీలు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ చాలా ఉద్వేగంగా, ప్రజలను ఆక్కటుకొనే విధంగా ప్రసంగించారు. “మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్స్ రాజశేఖర్ రెడ్డి, ఆయన మంత్రులు, కుటుంబ సభ్యులు కలిసి విచ్చలవిడిగా రాష్ట్రాన్ని ముఖ్యంగా తెలంగాణా ప్రాంతాన్ని , వారి భూములను దోచుకొన్నారు. అప్పటి నుండే తెలంగాణా ప్రజలలో తాము దోచుకోబడుతున్నామనే భావన పెరగసాగింది. ఆ అవకాశాన్ని కేసీఆర్ చాలా తెలివిగా ఉపయోగించుకొని, ప్రజలలో విద్వేషాలు రెచ్చగొడుతూ చివరికి రాష్ట్ర విభజనకి కారకులయ్యారు.

 

కేసీఆర్, రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ చేస్తున్న అన్యాయం చూస్తున్న నాకు చాలా ఆవేశం కలిగేది. కానీ, నావల్ల ఈ సమస్య మరింత జటిలం కాకూడదనే ఆలోచనతోనే నేను ఇంతకాలంగా నోరు విప్పలేదు. కానీ, అత్యంత అవమానకరంగా తెలుగుజాతిని విభజించిన తరువాత నేను ఇక సహించలేక రాజకీయాలలో ప్రవేశించాను. నాకు అధికారం, పదవులు సంపాదించుకోవాలనే తపన ఎంత మాత్రం లేదు. కేవలం దేశ సమగ్రతను కాపాడుకోవాలనే తపనతోనే నేను రాజకీయాలలోకి వచ్చేను. అందువల్ల ఈ కేసీఆర్, తెరాస నేతల బెదిరింపులకి, వారు నాపై పెడుతున్న కేసులకి బయపడేది లేదు, జైలుకి వెళ్లేందుకు కూడా భయపడను. కేసీఆర్ దేశానికి ప్రధాని కాబోతున్న వ్యక్తి పట్ల చాలా అవమానకరంగా మాట్లాడారు. ముందు ఆయన మోడీ గారికి క్షమాపణ చెపితే అప్పుడు నేనేమి చేస్తానో చెపుతాను.

 

సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ వంటి మహానుభావులు దేశాన్ని సమగ్రంగా నిలిపి ఉంచేందుకు ప్రయత్నిస్తే, కేసీఆర్, సోనియా, రాహుల్ గాంధీ వంటి వారు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం దేశసమగ్రతకు భంగం కలిగించడానికి కూడా వెనుకాడటం లేదు.అందుకే ప్రజలు కాంగ్రెస్, తెరాసలకు బుద్ధి చెప్పాలని కోరుకొంటున్నాను. అందుకే ‘కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్’ అని నినదిస్తున్నాను.

 

ఇప్పుడు ఇక్కడ “వైకాపా హాటావ్ సీమాంధ్ర బచావ్” అని పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ఆ రెండు పార్టీలు దొందుకు దొందే. కేసీఆర్ సీమాంద్రా ప్రజలను అంత ఘోరంగా అవమానిస్తుంటే, సీమాంద్రాకు ముఖ్యమంత్రి అవుదామని కలలుగంటున్న జగన్మోహన్ రెడ్డి ఏనాడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఎందుకు అతనిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించలేదు? అతనిని చూసి ఎందుకు భయపడుతున్నారు? అంటే వారిరువురూ కూడా కాంగ్రెస్ అధిష్టానంతో రహస్య అవగాహన కలిగినవారే గనుక. అందుకే వారు ఒకరినొకరు విమర్శించుకోరు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడలేని జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా వారికి ముఖ్యమంత్రి అవుదామని ఆశిస్తున్నారు? అతని ఆ అర్హతే లేదు.

 

నేను తెలంగాణా పల్లె పల్లెలో కూడా తిరిగి వచ్చాను. కానీ జగన్మోహన్ రెడ్డి దైర్యంగా తెలంగాణాలో తిరగగలరా? అక్కడి ప్రజలకి సీమాంధ్ర ప్రజలపై ఎటువంటి ద్వేష భావనలు లేవు. వారు కేవలం తమను దోపిడీ చేసిన రాజశేఖర్ రెడ్డి వంటి వారిని మాత్రమే వారు ద్వేషిస్తున్నారు. అటువంటి వారికి అధికారం కట్టబెడితే మళ్ళీ భూ కబ్జాలు, దోపిడీ రాజ్యమే వస్తుంది. వైకాపాకి ఓటేస్తే అది కాంగ్రెస్ పార్టీకి వేసిన ఓటే అవుతుంది. సమైక్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే దోచేసిన వారికి విడిపోయిన చిన్న రాష్ట్రాన్నిదోచేయడం పెద్ద కష్టమేమీ కాదు. గుడిని మింగిన వారికి ధ్వజస్థంభం మింగేయడం కష్టమా? అందువల్ల వైకాపా ‘హటావ్ సీమాంద్రా బచావ్’ అని పిలుపునిస్తున్నాను.

 

ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవడానికి మనం తెలుగుదేశం, బీజేపీ అభ్యర్ధులకే ఓటేసి గెలిపించు కోవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారం చేపడితే మన రాష్ట్రం దేశం రెండూ కూడా సత్వర అభివృద్ధి సాధిస్తాయని నేను దృడంగా నమ్ముతున్నాను. అందుకే మిమ్మల్ని కూడా తెదేపా-బీజేపీ అభ్యర్ధులకే ఓటేసి గెలిపించమని కోరుతున్నాను,” అని పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ముగించారు.