కేసీఆర్ నీ తాట తీస్తా! పవన్ కళ్యాణ్

 

తెదేపా-బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా ఈరోజు వరంగల్ పట్టణంలో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ కూడా కొంచెం హద్దులు మీరారు. దేశానికి ప్రధాని కాబోయే నరేంద్ర మోడీని ఉద్దేశించి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ‘మోడీ, బీడీ’ అని నోటికి వచ్చినట్లు వాగితే సహించబోనని హెచ్చరించారు.

 

“కేసీఆర్! నువ్వు నన్ను ఏమన్నా సహిస్తాను. కానీ దేశంలో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి చెప్పట్టబోతున్న బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీని ఏమయినా అంటే మేము సహించను. ఆయన గురించి చులకనగా మాట్లాడితే నీ తాట తీస్తాను! ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి దేశ సమగ్రతకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోనని తీవ్రంగా హెచ్చరించారు.

 

ఊహించినట్లే ఆయన మాటలకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ సహజంగా కొంచెం ఆవేశపరుడు గనుక ఆయన నుండి ఇటువంటి పంచ్ డైలాగులు రావాలని సభకు వచ్చిన వారు ఆశించడం సహజమే. ఇదంతా పార్ట్ అండ్ ప్యాక్ ఆఫ్ మన (మురికి) రాజకీయాలు అని అందరూ తేలికగా తీసుకోవచ్చును. అయితే ఇక్కడ గమనించ వలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మొదటి నుండి కూడా కేసీఆర్ తన ప్రసంగంలో ప్రత్యర్ధులను ఉద్దేశించి వాడే ‘సన్నాసులు, లఫంగులు’ వంటి తిట్లను వాడటాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. రాజకీయ విలువలను మరింత దిగజార్చే అటువంటి బాషను ఎవరూ కూడా సమర్దించరు. దానిని అందరూ గట్టిగా ఖండించవలసిందే!

 

అయితే ఆయన బాషను తప్పు పడుతున్న పవన్ కళ్యాణ్ కూడా ఇంచుమించు అదే విధంగా మాట్లాడుతున్నారిప్పుడు. తనకంటే వయసులో, రాజకీయ అనుభవంలో ఎంతో పెద్దవాడయిన కేసీఆర్ ని పట్టుకొని ‘నీ తాట తీస్తానని’ అనడం ఏవిధంగా పవన్ సమర్దించుకోగలరు?

 

ఇక ఆయన తన జనసేన పార్టీ స్థాపిస్తున్న సందర్భంగా తనకు కులాలు, మతాలు, ప్రాంతాలు ఆపాదించవద్దని, అదేవిధంగా ప్రజలు కూడా ఈ బలహీనతల నుండి బయటపడి అన్ని విధాల సమర్దులు, నిజాయితీపరులు అయిన వ్యక్తులకే ఓటు వేయాలని హితబోద చేసారు. కానీ అదే పవన్ కళ్యాణ్ నేడు బీసీల ప్రస్తావన చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశంలో మొట్టమొదటి సారిగా బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీని ఏమయినా అంటే చూస్తూ ఊరుకోమని, కులాల ప్రసక్తి తేవడం ద్వారా ఈ బలహీనత నుండి ఆయన కూడా ఇంకా బయటపడలేదని స్పష్టం చేసారు. అందుకే ఎదుటవాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అని ఒక కవి శలవిచ్చారు.

 

పవన్ కళ్యాణ్ కుల ప్రస్తావన తేకుండా దేశానికి ప్రధాని కాబోయే ఒక వ్యక్తిని పట్టుకొని ఆవిధంగా మాట్లాడవద్దని హెచ్చరించి ఉండి ఉంటే ఆయన స్థాయికి తగ్గటుగా ఉండేది. ఆశయాలను ఆచరణలో పెట్టడం ఆలోచినంత తేలిక కాదు. అయితే అలాగని ఆ ప్రయత్నం ఎన్నడూ మానుకోకూడదు. నిరంతర సాధనతోనే అది సాధ్యమవుతుంది.