జగన్ పై పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు

 

ఇటీవల వైజాగ్ లో బహిరంగ సభ నిర్వహించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అనేక విషయాలపై సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేయడంతో రాజకీయ నాయకుల నుండే కాక ప్రజల నుండి కూడా విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఈనాడు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పార్టీ, దాని ఉద్దేశ్యాలు, వివిధ పార్టీ అధినేతల గురించి మరికొంత స్పష్టత ఇచ్చేరు.

 

ఎన్నికలలో పోటీ చేసే ఆలోచన లేనప్పుడు పార్టీ ఎందుకు పెట్టారనే అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ “రాష్ట్రంలో, దేశంలో ప్రస్తుతం నెలకొన్న విచ్చినకర పరిస్థితులను చూస్తూ కూర్చోలేకనే తాను పార్టీని పెట్టాను తప్ప ఎన్నికలలో పోటీ చేయాలనే ఏకైక లక్ష్యంతో కాదని జవాబిచ్చారు. కానీ పోటీ చేసేందుకు తగిన అభ్యర్ధుల కోసం తాను వెతికినట్లు ఆయన అంగీకరించారు. అయితే ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో తాను కూడా కొందరు అభ్యర్ధులను పోటీలోకి దింపడం వలన వ్యవస్థకు లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందనే ఉద్దేశ్యంతోనే వెనుకంజ వేసినట్లు చెప్పారు. అయితే 2019 ఎన్నికల నాటికి జనసేన పార్టీ పూర్తిస్థాయిలో పోటీ చేసేలా తాను కృషిచేస్తానని అన్నారు. ఈలోగా రెండు రాష్ట్రాలలో అధికారం చెప్పట్టే రాజకీయ పార్టీలను ప్రజల తరపున నిలదీస్తానని తెలిపారు. అందుకోసం తాను ఇకపై సినిమాలలో నటించడం సగానికి సగం తగ్గించుకొంటానని తెలిపారు.

 

ఇక, పవన్ కళ్యాణ్ తన వైజాగ్ సభలో కాంగ్రెస్ నేతలను పేరుపేరునా విమర్శించినప్పటికీ, తన సోదరుడు చిరంజీవిని కానీ, జగన్మోహన్ రెడ్డిపై కానీ గట్టిగా మాట్లాడకపోవడాన్ని కూడా చాలా మంది తప్పు పట్టారు. దానికి సమాధానంగా నేను వ్యక్తిగతంగా ఎవరినీ ద్వేషించడం లేదు. వారి సిద్దాంతాలను మాత్రమే విమర్శిస్తున్నాను. కానీ ఒకవేళ నా సోదరుడు చిరంజీవి నోరు విప్పి మాట్లాడినా ఎటువంటి ప్రయోజనమూ ఉండేది కాదని చెపుతూ పవన్ అన్నయ్యను వెనుకేసుకు వచ్చారు.

 

వ్యక్తిగతంగా ఎవరినీ ద్వేషించను అంటూనే జగన్మోహన్ రెడ్డిని మాత్రం తీవ్రంగా విమర్శించారు. తాను ఎన్నో ఏళ్ళపాటు శ్రమిస్తే తప్ప కొద్దిపాటి ఆస్తులను కూడా సంపాదించలేకపోయానని, అయినప్పటికీ గత రెండేళ్లలో సరయిన హిట్స్ లేక ఆదాయపన్ను కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడిందని, కానీ జగన్మోహన్ రెడ్డి కొద్దిపాటి సమయంలోనే ఏవిధంగా అన్ని కోట్లు కూడబెట్టగలిగారని పవన్ ప్రశ్నించారు. ఆయనకు వ్యతిరేఖంగా ఒక గదినిండా పోగుపడిన చార్జ్ షీట్లు, ఆరోపణల పత్రాలను పెట్టుకొని ఆయన ఏవిధంగా స్వచ్చమయిన పాలన అందిస్తానని హామీ ఇస్తున్నారు? అని ప్రశ్నించారు. తన తండ్రి చనిపోయిన బాధ కూడా లేకుండా ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన పడిన ఆరాటాన్ని పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు.

 

అదేవిధంగా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి అవినీతిని ప్రజల జీవితాలలో ఒక భాగమేననే స్థాయికి తీసుకువచ్చి అందరినీ అవినీతిపరులుగా మార్చే ప్రయత్నం చేసారని ఆరోపించారు. తండ్రి అవినీతికి పాల్పడితే, కొడుకు అధికారం కోసం అర్రులు చాస్తున్నారని ఎద్దేవా చేసారు. జగన్మోహన్ రెడ్డిపై మోపబడిన నేరారోపణలు నిరూపింపబడక పోయినప్పటికీ,అవ్వన్నీ అబద్దాలని కొట్టిపారేయలేమని అందువల్ల ఆయన అధికారం ఆశించే ముందు, తన కేసులనుండి స్వచ్చంగా బయటపడి ఉంటే బాగుండేదని అన్నారు. అవినీతి ఆరోపణలు తప్ప ఎటువంటి పరిపాలనానుభవమూ లేని ఆయనకు అధికారం కట్టబెట్టడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

 

మంచి పరిపాలనా దక్షుడిగా నిరూపించుకొన్న చంద్రబాబు వలననే రాష్ట్రంలో మళ్ళీ సుస్థిరత ఏర్పడుతుందని ఆయన అబిప్రాయం వ్యక్తం చేసారు. అయితే చంద్రబాబు కూడా తన హయాంలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి పొరపాటు చేసారని, కానీ మళ్ళీ అవకాశమిస్తే వాటిని సవరించుకొనే ప్రయత్నం చేస్తారని తను ఆశిస్తున్నట్లు తెలిపారు. మోడీకి మద్దతు ఈయడంపై కూడా మాట్లాడుతూ గుజరాత్ లో జరిగిన అల్లర్లకు మోడీ చాలా సార్లు పశ్చాతాపం వ్యక్తం చేసారని, అలాగని ఆయన తప్పులు చేయలేదని నేనూ భావించట్లేదని,అయితే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశానికి అటువంటి సమర్దుడయిన నాయకుడు చాలా అవసరమనే ఉద్దేశ్యంతోనే తాను ఆయనకీ మద్దతు ఇచ్చానని తెలిపారు.