పవన్ సమావేశానికి మళ్ళీ చిరు అడ్డంకులు

 

కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టుకొనేందుకు ఏర్పాట్లు చేసుకొంటుంటే, అది గిట్టని ఆయన సోదరుడు చిరంజీవి ముందుగా తన కొడుకు రాం చరణ్ తేజ్ చేత తాను తన తండ్రి పక్షమే వహిస్తున్నాని చెప్పించి అభిమానులను తనవైపు త్రిప్పుకొనే ప్రయత్నం చేసారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ సమావేశం జరిగే ముందురోజున తన సోదరుడు నాగబాబుతో “తాను కూడా అన్నయ్య చిరంజీవి వెంటే నడుస్తున్నాని, అభిమానులు కూడా తమవెంటే వస్తారని ఆశిస్తున్నామంటూ” ఒక మీడియా ప్రకటన కూడా చేయించారు. అంతటితో ఆగకుండా చిరంజీవి స్వయంగా తన అభిమాన సంఘాల నేతలకు పోన్లు చేసి “తమ్ముడు పవన్ సమావేశానికి వెళ్ళవద్దని” కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే చిరంజీవి ఎంత ప్రయాసపడినప్పటికీ, పవన్ కళ్యాణ్ సమావేశానికి వేలాదిమంది అభిమానులు తరలి వచ్చారు. ఒక్క సీమాంద్రానుండే కాక తెలంగాణా నుండి కూడా చాలా మంది అభిమానులు పవన్ కళ్యాణ్ కి తమ మద్దతు ప్రకటించారు. కారణం వారు అతని మాటలలో నిజాయితీ ఉందని నమ్మడమే. ఇంత జరిగినా చిరంజీవి మాత్రం తన కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు చేయడం మానుకోలేకపోతున్నారు.

 

పవన్ వంటి యువకులు రాజకీయాలలోకి వచ్చి పార్టీలు పెట్టడం తాను కూడా స్వాగతిస్తానని తన బస్సు యాత్రలో చెపుతూనే, మళ్ళీ అందరూ కేవలం కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని కోరడం విడ్డూరం. రేపు పవన్ కళ్యాణ్ వైజాగులో తన జనసేన పార్టీ మొట్టమొదటి సమావేశం నిర్వహించబోతుండటంతో చిరంజీవి మళ్ళీ తన కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు ప్రదర్శిస్తూ తన కుమారుడు రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని అతనిచేత హైదరాబాదు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో మెగాభిమానులతో ఒక సమావేశం ఏర్పాటు చేయిస్తున్నారు.

 

మొన్న రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ తనకు సరయిన రాజకీయ అవగాహన లేదని అన్నారు. కానీ రేపు సాయంత్రం అభిమానులతో జరుపబోయే సమావేశంలో ఆయన రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి చర్చిస్తారని వార్తలు రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. రేపు సాయంత్రమే బాబాయ్ పవన్ కళ్యాణ్ తన మొదటి రాజకీయ సభను నిర్వహిస్తున్నారని తెలిసి కూడా రామ్ చరణ్ కూడా సరిగ్గా అదే సమయంలో సమాంతరంగా హైదరాబాదులో మరో సమావేశం నిర్వహించడంతో అభిమానులు బాబాయ్-అబ్బాయ్ లలో ఎవరినో ఒకరిని ఎంచుకోక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు.

 

ఇటువంటి ప్రయత్నాల వలన పవన్ కళ్యాణ్ కి వచ్చే నష్టం ఏమీ లేకపోయినా, చిరంజీవి ప్రతిష్ట మాత్రం మరింత మసక బారడం ఖాయం.