కమలనాథుల గుండెల్లో బాంబు పేల్చిన పవన్

 

నిన్న కాక మొన్న వచ్చిన పవన్ కల్యాణ్.. కాకలు తీరిన రాజకీయ నాయకులకు దిమ్మతిరిగేలా చేస్తున్నాడు. ఇంకేముంది, జనసేన-బీజేపీ-టీడీపీ కలిసి పొత్తు పెట్టుకుంటాయని, దాంతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని నాయకులు ఊహల పల్లకిలో తేలిపోయారు. వాళ్ల ఆశలను ఆదిలోనే పవన్ తుస్సుమనిపించాడు. తన మద్దతు జాతీయ పార్టీకేనని, ఇంకా గట్టిగా మాట్లాడితే కేవలం మోడికి మాత్రమే పరిమితమని బాంబు పేల్చాడు. తనను దగ్గరుండి, చెయ్యి పట్టుకుని మరీ మోడీ దగ్గరకు తీసుకెళ్లిన బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజుకు ఈ మేరకు ఓ లేఖాస్త్రం సంధించారు.

 

‘‘టీడీపీతో సహా ఏ ప్రాంతీయ పార్టీకీ మద్దతు ఇవ్వాలని నేను ఈరోజు వరకు నిర్ణయించుకోలేదు. లేనిపోని పుకార్లు వస్తున్న నేపథ్యంలో నేనీ విషయాన్ని స్పష్టం చేస్తున్నా. జనసేన, మోడీ మధ్య సత్సంబంధాలు పెంపొందాలని, అవి మరింత పటిష్టం కావాలని మాత్రమే ఆకాంక్షిస్తున్నా’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

 

హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉన్న వీర్రాజుకు ఈ లేఖ అందిన వెంటనే ఆయన పవన్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదని తెలిసింది. ఈ లేఖ ఉద్దేశమేమిటో తెలుసుకునేందుకు ఆయన పవన్ సహచరులతో మాట్లాడారు. అయితే, ఇటువంటి వ్యవహారాల్లో తమ ప్రమేయం ఉండదని, నేరుగా పవన్‌నే సంప్రదించి విషయం తెలుసుకోవాలని సూచించారు. దీంతో ఆయన ఈ లేఖను ఢిల్లీలోని పార్టీ కార్యాలయానికి ఫ్యాక్స్ చేసి, పొత్తు వ్యవహారాలను చూస్తున్న అరుణ్ జైట్లీకి అందజేయాలని కోరినట్టు తెలిసింది.