ఈ జనసేన దారేటో?

 

పవన్ కళ్యాణ్ తన ‘జనసేన’ పార్టీని ప్రకటించి ఇప్పటికి పదిరోజులు అవుతున్నా మళ్ళీ ఇంతవరకు పార్టీ పరంగా ఎటువంటి కార్యక్రమాలు చెప్పట్టలేదు. మూడు రోజుల క్రితం గుజరాత్ వెళ్లి బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీని కలిసి ఆయనకు మద్దతు తెలిపి వచ్చారు. కానీ, పవన్ కళ్యాణ్ తను కేవలం మోడీకి మాత్రమే మద్దతు ఇస్తున్నానని, బీజేపీ, తెదేపాలతో తన పార్టీ పొత్తులు పెట్టుకోబోతున్నట్లు లేదా వాటికి మద్దతు ఇస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదని, తాను ఇంకా ఆ విషయంపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని ఒక లేఖ వ్రాసారని తాజా సమాచారం. అదే నిజమయితే, బీజేపీకి, దానితో ఎన్నికల పొత్తులు కుదుర్చుకోబోతున్న తెదేపాలకు మద్దతు ఇవ్వకుండా కేవలం మోడీకి మాత్రమే ఏవిధంగా మద్దతు ఈయడం సాధ్యమో ఆయనే వివరించాల్సి ఉంది.

 

 

ఈనెల 27న జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ వైజాగ్ లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. అందుకోసం ఈరోజు నుండి పవన్ అభిమానులతో బైక్ ర్యాలీలు నిర్వహించి ప్రచారం చేయాలని భావిస్తున్నారు. అయితే ఎన్నికలకి కేవలం నెలన్నర సమయం మాత్రమే మిగిలి ఉన్న ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ముందుగా పార్టీ నిర్మాణం చేపట్టకుండా ఇటువంటి కార్యక్రమాలపై దృష్టి పెట్టడం చూస్తే, జనసేన పార్టీ అసలు ఎన్నికలలో పోటీ చేస్తుందా లేదా? అనే అనుమానాలు కలగడం సహజం. తను అదికారం కోసమో ముఖ్యమంత్రి పదవి కోసమో పార్టీ స్థాపించలేదని ఆయన చెప్పడం గమనిస్తే, బహుశః ఈ ఎన్నికలలో జనసేన తరపున చాలా కొద్ది మందిని మాత్రమే పోటీలో నిలుపవచ్చు లేదా తెదేపా, బీజేపీలకు మద్దతుగా ప్రచారం చేసినా చేయవచ్చును. అదే జరిగితే ఆ మాత్రం దానికి ఆయన పార్టీని పెట్టి ఇంత శ్రమ తీసుకోవడం వృధా ప్రయాసేనని చెప్పక తప్పదు. బహుశః పవన్ కళ్యాణ్ వైజాగ్ లో నిర్వహించబోయే బహిరంగ సభలో ఈ విషయమై మరింత స్పష్టత రావచ్చును.