పవన్ నా రాజకీయ శత్రువు: చిరంజీవి

 

ఎవరూ ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా జనసేన పార్టీ పెట్టి రాజకీయాలలోకి ప్రవేశించడంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ఉలిక్కిపడ్డాయి. కానీ ఆయన తాను కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకే రాజకీలలో ప్రవేశించానని విస్పష్టంగా ప్రకటించడంతో అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుదుటపడింది. అయితే, సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత భుజానికెత్తుకొన్న చిరంజీవి మాత్రం షాక్ అయ్యారనే చెప్పవచ్చును. అందుకే ఆయన పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపన సమావేశానికి తన అభిమానులను వెళ్ళవద్దని కోరారు. తన సోదరుడు నాగబాబు ద్వారా అభిమానులను తన వెంట నడవాలని పిలుపునిచ్చారు. బీవీ రాఘవులు వంటి కొందరు రాజకీయ నేతలు, విశ్లేషకులు పవన్ కళ్యాణ్ పార్టీ కూడా చివరికి కాంగ్రెస్ పార్టీలోనే విలీనం అయిపోతుందని , జనసేన కేవలం ఓట్లు చీల్చడానికి తప్ప మరి దేనికీ పనికిరాదని అభిప్రాయపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలు, మ్యానిఫెస్టో, ‘సవినయంగా మనవి చేసుకొంటున్నాను’ వగైరా పడికట్టు పదాలతో ఊకదంపుడు ఉపన్యాసం చేయకుండా అభిమానులతో తన మనసులో భావాలను పంచుకొన్నట్లుగా సాగడంతో రాజకీయ విశ్లేషకులు, మీడియా కూడా పెదవి విరిచింది. అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ ఉపన్యాసానికి ఆయన అభిమానుల నుండే కాక ప్రజల నుండి కూడా చాలా సానుకూల స్పందన వచ్చింది. కారణం ఆయన ఊకదంపుడు ఉపన్యాసం చేయకుండా సాధారణ ప్రజల మనోభావనలను తన ప్రసంగంలో చక్కగా ప్రతిబింబింపజేయడమే.

 

ఇప్పటికే సీమాంద్రాలో ఖాళీ అయిపోయిన కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో గెలిపించే బాధ్యత తీసుకొన్న చిరంజీవికి ఇది ఊహించని పెను సవాలుగా మారింది. అందుకే ఆయన తన సోదరుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడక తప్పలేదు. ఒకవేళ ఇప్పటికీ ఆయన మాట్లాడకపోయినట్లయితే, ఆయనను కాంగ్రెస్ పార్టీ శంఖిస్తుంది గనుకనే తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడారు.

 

“తమ్ముడు పవన్ కళ్యాణ్ వేరే పార్టీ పెట్టుకొన్నాడు గనుక ఇకపై నేను కూడా అతనిని మా రాజకీయ ప్రత్యర్దిగానే భావించి ఎదుర్కొంటాను. కాంగ్రెస్ పార్టీ మిగిలిన రాజకీయ పార్టీలను ఏవిధంగా ఎదుర్కొంటుందో తమ్ముడి జనసేనను కూడా అదేవిధంగా ఎదుర్కొంటుంది. నేటికీ నా అభిమానులు, ప్రజలు అందరూ కాంగ్రెస్ వెంటే ఉన్నారని నమ్ముతున్నాను. అందువల్ల అతను పార్టీ స్థాపించి కాంగ్రెస్ పార్టీని ఓడిస్తానని చెప్పినంత మాత్రాన్న మేమేమి భయపడటం లేదు. సమాజసేవ చేయాలనే తలపుతో అతను రాజకీయాలలో ప్రవేశించి పార్టీ స్థాపించాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం పూర్తిగా అతని వ్యక్తిగత విషయం గనుక నేనేమి ఆ విషయంలో కలుగజేసుకోను.కానీ, తమ్ముడికి ఎల్లపుడూ నా ఆశీస్సులు ఉంటాయి,” అని అన్నారు. అయితే, పవన్ పార్టీ స్థాపిస్తున్నపుడు అన్ని విధాలా అడ్డంకులు సృష్టించి, ఇప్పుడు ఈ నీతి కబుర్లు చెప్పడం చిరంజీవి నైజానికి అద్దంపడుతోంది.