పవన్ కి అలీ కూడా గుడ్ బై చెప్పెస్తాడా?

 

పవర్ స్టార్ పొలిటికల్ పవర్ స్టార్ గా మారుతున్నారు. సిల్వర్ స్క్రీన్ నుంచి పొలిటికల్ సీన్ లోకి ఎంటరవుతున్నారు. అయితే పవన్ కు ఉన్న అతికొద్ది మంది స్నేహితులు ఆయన వెంట నడుస్తారా? సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తుందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పవన్ అంతరంగికుల్లో ఒకరైన మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ పవర్ స్టార్ పార్టీ వ్యూహకర్తల్లో ఒకరంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా నుంచి ఇటీవల విడుదలయిన ‘అత్తారింటికి దారేది’ వరకూఅతనితో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ అతనితో కలిసి పయనిస్తున్న నటుడు అలీ. ఈ విషయాన్ని అలీ, పవన్ లు వేర్వేరు సందర్భాల్లో సినిమా వేదికలపై చాలాసార్లు ప్రకటించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పార్టీ ‘జనసేన’ విడుదలకు సిద్ధమైంది. ఇదే తరుణంలో అలీ టీడీపీలో చేరి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. పవన్ పార్టీ పెడుతుండగా అలీ తెలుగుదేశం వైపు ఎందుకు చూస్తున్నారు? వీరిద్దరి స్నేహం ముగిసిందా? ఇద్దరి మధ్యా విభేదాలు పొడసూపాయా? లేక పవన్ అన్నయ్య చిరంజీవిని కాదని తన పంధాలో తను సాగాలనుకొన్నట్లే, ఆలీ కూడా తను అభిమానించే తెలుగుదేశంలో చేరబోతున్నారా? అనే విషయాలు వీరిద్దరిలో ఎవరో ఒకరు చెబితే గానీ క్లారిటీ రాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

అలీ ఎంద సీటు?

సినిమాల్లో ఎంద చేట, కాట్రవల్లి ఊత పదాలతో అలరించిన ప్రముఖ హాస్య నటుడు అలీ రాజకీయాల్లోకి వస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన సొంతూరు రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని వెలువడినవి ఊహగానాలుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం గుంటూరు అర్బన్ తూర్పు నియోజకవర్గం నుంచి అలీ పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో ముస్లిం మైనారిటీలు ఎక్కువమంది ఉండటం, ఇదే స్థానం నుంచి గతంలో బరిలో దిగిన దివంగత టీడీపీ సీనియర్ నేత లాల్ జాన్ భాషా సోదరుడు జియాఉద్దీన్ పోటీకి విముఖత చూపడంతో అలీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని టీడీపీ నేతలు, అలీ గానీ ఖండించట్లేదు. అంటే అలీ తెదేపాలో చేరడం, గుంటూరు నుండి పోటీ చేయడం ఖాయమనుకోవచ్చేమో.