పఠాన్‌కోట్‌లో 250 మంది గూఢచారులు?

పఠాన్‌కోట్ వైమానిక స్థావరం వద్ద పట్టబడుతున్న గూఢచారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న సందీప్‌ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేయడంతో అసలు ఇంతకీ పఠాన్‌కోట్‌కి సంబంధించిన రహస్యాలు పాకిస్తాన్‌కి ఎలా చేరాయి అన్న విషయం మీద నిఘా వర్గాలు మరింత దృష్టిని పెట్టాయి. ఇందులో భాగంగా పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంలోకి తరచూ ప్రవేశించే అవకాశం ఉన్న 250మందితో కూడిన జాబితాను రూపొందించాయి. పఠాన్‌కోట్‌లో జరిగే చిన్నాచితకా మరమ్మతుల కోసమో, సైనికులకి ఏవన్నా సౌకర్యాలను అందించడానికో తరచూ లోపలికి ప్రవేశించే ఈ వ్యక్తులలో ఎవరైనా కూడా గూఢచారులుగా పనిచేసే అవకాశం ఉందని నిఘావర్గాలు భావిస్తున్నాయి. అందుకని ఈ జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరి గురించీ నిజాలను వెలికితీస్తున్నాయి. పఠాన్‌కోట్‌ మీద దాడి చేసేందుకు పాకిస్తాన్‌లో ఒక పక్కా ప్రణాళికను రూపొందించుకున్నారనీ, ఇందుకు స్థానికంగా ఉన్న చాలామంది పాకిస్తాన్‌ గూఢచారులు తగిన సమాచారాన్ని అందించారనీ నిఘా వర్గాల అంచనా! ఈ ఇంటి దొంగలను పట్టుకోవాలన్నదే ఇప్పుడు పోలీసులు ప్రయత్నం. కానీ జరగాల్సిన నష్టమైతే ఎప్పుడో జరిగిపోయింది. పఠాన్‌కోట్‌లో జరిగిన దాడిలో 7గురు సైనికులు మరణించడంతో పాటు, దేశంలోని రక్షణ దళాలు ఉలిక్కిపడే పరిస్థితి వచ్చింది.