విస్తరిస్తున్న రామ్‌దేవ్‌ వ్యాపార సామ్రాజ్యం

జాతీయ స్థాయిలో ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక్క సబ్బు ముక్కని విపణిలోకి వదిలినా, దానికి పోటీ పడేందుకు వందలాది బ్రాండ్‌లు సిద్ధంగా ఉంటాయి. అలాంటి ఒక సంస్థ కేవలం ఐదేళ్లలో 20 రెట్ల అభివృద్ధి సాధించిందంటే అది ఊహించని విజయమే అని చెప్పుకోవాలి. ఆ విజయాన్ని సాధించింది పతంజలి. 2011లో 400 కోట్ల వ్యాపారం చేసిన పతంజలి 2016-17 నాటికి పదివేల కోట్ల వ్యాపారాన్ని లక్ష్యంగా ఏర్పరుచుకుంది. సహజసిద్ధమైన ఉత్పత్తులు తక్కువ ధరకే అన్న నమ్మకమే నిజానికి పతంజలి విజయరహస్యంగా మారిపోయింది. ప్యాకింగ్‌ దగ్గర్నుంచీ ఉన్నతస్థాయి ప్రమాణాలను పాటించడం, నూడిల్స్‌తో సహా ప్రతి ఉత్పత్తికీ ప్రత్యామ్నాయాన్ని అందించడంతో జనం పతంజలి వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. ఏదో ఒకసారి కొని చూద్దాం అనుకునేవారంతా, ప్రస్తుతానికి పతంజలికి అలవాటు పడసాగారు. పతంజలి దెబ్బకి డాబర్‌, కోల్గేట్ పామోలివ్, నెస్లే వంటి అంతర్జాతీయ వ్యాపార సంస్థలన్నీ కుదేలైపోతున్నాయి. బ్రాండ్‌ వాల్యూ కోసమే కోట్ల కొద్దీ ఖర్చుపెట్టే ఆ సంస్థలన్నీ, దిక్కుతోచకున్నాయి.

 

పతంజలి నుంచి వచ్చిన ఒక్క దంత్‌కాంతి పేస్టే 2015-16లో 450 కోట్ల అమ్మకాన్ని సాధించిందంటే దాని దెబ్బ మిగతా సంస్థల మీద ఎలా ఉండి ఉంటుందో ఊహించవచ్చు. ఒకవైపు విజయం సాధిస్తూనే రామ్‌దేవ్‌ మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, బీహార్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలను సానుకూలపరచుకుని అక్కడ తన వ్యాపారానికి అవసరమైన వనరులను పొందడంలో విజయం సాధించారు. మరో వైపు ఖాధీ నుంచి పశువుల దాణా వరకూ మరిన్ని ఉత్పత్తులను వెలువరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ విజయంలో సామాన్యలు భాగస్వామ్యమేమీ తక్కువ కాదు. ఉచితాలు, ప్రకటనలు, సంస్థ పేర్లు చూసి కాకుండా ధరనీ, మన్నికనీ చూసి తాము ఉత్పత్తిని కొనుగోలు చేస్తామని జనం చెప్పకనే చెప్పినట్లయింది. అందుకని రామ్‌దేవ్‌గారు ఇదంతా కేవలం తన మహిమే అని భ్రమించకుండా, మున్ముందు కూడా సామాన్యుల ఆశకు అనుగుణంగా నడుచుకుంటారని అశిద్దాం