హుజూర్ బైపోరులో టీఆర్ఎస్ కి కొత్త భయం... టెన్షన్ పెడుతోన్న రోడ్ రోలర్, ట్రాక్టర్

 

ఒకవైపు ఆర్టీసీ సమ్మె, ఇంకోవైపు కేసీఆర్‌ సభ వర్షార్పణం కావడంతో, టెన్షన్‌ పట్టుకున్న టీఆర్ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డికి, మరో ఇద్దరు తెగ టెన్షన్‌ పెడుతున్నారు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు ప్రధాన పోటీ కాంగ్రెస్ నుంచే అయినప్పటికీ... ఓట్ల చీలికతో బీజేపీ, టీడీపీ కూడా ఎంతోకొంత టెన్షన్ పెడుతున్నాయి. అయితే, ప్రధాన పార్టీలే కాకుండా, ఇండిపెండెంట్లు కూడా టీఆర్ఎస్ అభ్యర్ధి గుండెల్లో గుబులురేపుతున్నారు. అసలు, వారిద్దరూ అసలు పోటీ కాకపోయినా, వారి గుర్తులు మాత్రం తెగ టెన్షన్ పెట్టిస్తున్నాయి.

రోడ్ రోలర్, ట్రాక్టర్... ఈ రెండు గుర్తులూ దాదాపు టీఆర్ఎస్ సింబల్ కారును పోలి ఉంటాయి. ఈ రెండు గుర్తులే ఇప్పుడు టీఆర్ఎస్‌ను తెగ టెన్షన్‌ పెడుతున్నాయి. హుజూర్‌ నగర్‌లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తులు కేటాయింది ఎన్నికల సంఘం. అదీ కూడా జాబితాలో టీఆర్ఎస్‌ కారు గుర్తు తర్వాత అవే ఉండటం, అధికారపక్ష అభ్యర్థిలో మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు వల్ల నష్టపోయామని, నిరక్షరాస్యులు, వృద్ధులు పొరపడి ట్రక్కు గుర్తుకు ఓటేయడంతో... పదివేల ఓట్లు పడ్డాయని, అందువల్లే టీఆర్ఎస్ ఓడిపోయిందని  అంటున్నారు. ఇప్పుడు హుజూర్ ‌నగర్‌ బైపోరులోనూ టీఆర్ఎస్‌ అభ్యర్థికి అలాంటి దిగులే పట్టుకుందట.

హుజూర్ ‌నగర్‌ బైపోల్ బరిలో మొత్తం 28మంది అభ్యర్థులున్నారు. ఇందులో అధికార టీఆర్ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డికి, నాలుగో నెంబర్‌ అలాట్ చేశారు. ఆయన తరువాత ఐదో నంబర్‌లో రైతుబిడ్డ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అజ్మీర మహేశ్‌ కి... ట్రాక్టర్‌ నడిపే రైతు సింబల్‌ను... అలాగే ఆరో నంబరులో రిపబ్లిక్‌ సేన తరఫున పోటీ చేస్తున్న నిలిచిన వంగపల్లి కిరణ్‌కు రోడ్డురోలర్‌ గుర్తును కేటాయించింది ఎలక్షన్‌ కమిషన్. ఈ రెండు గుర్తులూ కారు గుర్తుకు దగ్గరి పోలికలతో ఉండటంతో, తమకు పడాల్సిన ఓట్లు ఇతరులకు పడతాయేమోనని టెన్షన్‌ పడుతున్నారు గులాబీ నేతలు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కారును పోలిన ఆటోరిక్షా, లారీ చిహ్నాలు ఎవరికీ ఇవ్వవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరింది. అయితే ఇప్పుడు ఆ గుర్తులను అయితే ఈసీ కేటాయించలేదు. కానీ తాజాగా హుజూర్ నగర్ లో కారును పోలిన రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులు మాత్రం ఇద్దరు స్వతంత్రులు దక్కించుకున్నారు. దీంతో అధికారపక్షాన్ని గుర్తుల భయం వెంటాడుతోంది. ఇక గతంలోనూ టీడీపీ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంది. సైకిల్ ను పోలిన బైక్ గుర్తు, ఆ పార్టీని దెబ్బతీసింది. చాలా కష్టపడి ఈసీతో ఫైట్ చేసి బైక్ గుర్తును ఎన్నికల్లో నిషేధించింది టీడీపీ. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా తన కారు గుర్తు పోలిన గుర్తులపై పోరాటం మొదలెట్టింది. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కీలక స్థానాల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. పాలేరు..నకిరేకల్, భువనగిరి ఎంపీ స్థానాల్లో ఓటమి చవిచూసింది. మళ్లీ ట్రాక్టర్, రోడ్‌ రోలర్‌ గుర్తుల రూపంలో బిక్కుబిక్కుమంటున్నాడు టీఆర్ఎస్‌ అభ్యర్థి.

అయితే, గతంలో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా జనంలో అవేర్‌నెస్‌ తెచ్చేందుకు, గుర్తులపై అవగాహన కల్పిస్తున్నారు టీఆర్ఎస్‌ నేతలు. కారుకు రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులకు తేడాలను చూపిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు, హుజూర్ నగర్ లో ఇంటింటికి  వెళ్లి ఓటర్లకు వివరిస్తున్నారు. ప్రతీ ఓటూ అత్యంత కీలకంగా మారిన హుజూర్ నగర్ ఉపపోరులో... మరి, రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులు... టీఆర్ఎస్ ను ఏ మేరకు దెబ్బతీస్తాయో చూడాలి.