పార్లమెంటు సమావేశాలు ఆగస్ట్ 5 నుండి మొదలు

 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 30 వరకు జరుగుతాయి. మధ్యంతర ఎన్నికల గురించి జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నందున బహుశః పార్లమెంటుకు ఇవే ఆఖరి సమావేశాలు కావచ్చును. కాంగ్రెస్ తనకు ఓట్ల వర్షం కురిపిస్తుందని భావిస్తున్నఆహార భద్రతా బిల్లును ఈ సమావేశాలలో ప్రవేశపెట్టవచ్చును. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసే ఉద్దేశ్యం ఉంటే గనుక ఈ సమావేశాల్లోనే తెలంగాణపై బిల్లు కూడా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

 

కీలకమయిన ఈ రెండు బిల్లులు ప్రవేశపెట్టినా లేకున్నా కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు రెండూ కూడా ఒకరిపై మరొకరు దాడికి అస్త్రాలు సిద్ధం చేసుకొంటున్నాయి. బహుశః ఇదే ఆఖరి సమావేశమని ప్రతిపక్షాలు భావిస్తే ఆ దాడి మరింత తీవ్రంగా ఉండవచ్చును. క్రిందటిసారి సమావేశాల సమయంలో కాంగ్రెస్ ఉన్న పరిస్థితి కంటే ప్రస్తుత పరిస్థితి చాల మెరుగ్గా ఉంది గనుక, కాంగ్రెస్ కూడా అంతే దీటుగా ప్రతిపక్షాలను ఎదుర్కోవచ్చును.

 

అయితే అధికార విపక్షాల ఈ వ్యూహాల వలన పార్లమెంటు విలువయిన సమయం వృధాకావడం మినహా మరేమీ సాధించేది ఉండదని ఇరుపక్షాల నేతలకి తెలుసు. కానీ, ఎవరి రాజకీయ ప్రయోజనాలను వారు కాపాడుకోవడం కోసం తమ పరస్పర దాడులు, ఆరోపణలు, వాక్ అవుట్లు వంటివి కొనసాగిస్తుంటారు.