వైఎస్‌ హయాంలో మహిళల పసుపు-కుంకుమలు తుడిచేశారు

 

గుంటూరులోని తెదేపా కార్యాలయంలో మీడియా తో మాట్లాడిన మంత్రి పరిటాల సునీత జగన్ పాదయాత్రలకే పరిమితమని,ఆయన ఎప్పటికీ సీఎం కాలేరని స్పష్టం చేశారు.రాష్ట్రాభివృద్ధిపై అవగాహన లేని జగన్‌ తెదేపాపైనా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.వైఎస్‌ హయాంలో ఎంతో మంది మహిళల పసుపు-కుంకుమలు తుడిచేశారని, తాము చంద్రన్న పసుపు-కుంకుమ పేరుతో మహిళలకు సాయం చేస్తున్నామని తెలిపారు.కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో డ్వాక్రా మహిళలకు రూ.2,300కోట్ల వడ్డీ రాయితీ ఇస్తే తాము నాలుగేళ్లలోనే రూ.2,500 కోట్లు చెల్లించామన్నారు. రూ.50వేల కోట్లకు పైగా బ్యాంకు లింకేజీ రుణాలు చెల్లించామని మంత్రి తెలిపారు.

భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్‌కు వంతపాడుతున్నారని.. వైకాపా, భాజపా కుమ్మక్కై తెదేపా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.రాష్ట్రాభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సునీత వ్యాఖ్యానించారు. రాయలసీమలో అభివృద్ధి జరగలేదని కన్నా దుష్ప్రచారం ప్రారంభించారని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ హయాంలో రాయలసీమలో అభివృద్ధి జరిగిందా..? అని మంత్రి ప్రశ్నించారు.ఎన్టీఆర్‌ శంకుస్థాపన చేసిన హంద్రీనీవాను వైఎస్‌ ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చాక హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇస్తున్నామని, ఇవాళ సీమ మొత్తం పంటలతో కళకళలాడుతోందని మంత్రి సునీత తెలిపారు.