పరిటాల కేసును కొత్తమలుపు తిప్పిన అదృశ్య హస్తాలు

 

పరిటాల తనయుడిని హత్యకేసులో ఇరికించే తొందరలో ఆనంతపురం పోలీసులు, హత్య జరుగకపోయినప్పటికీ, సాధారణంగా హత్యజరిగిన తరువాత మాత్రమే వాడే సెక్షన్ల క్రింద పరిటాల తనయుడు శ్రీరామ్ మరియు ఇతర ముద్దాయిలపై కేసు నమోదు చేయడం, అందుకు కోర్టునుండి మొట్టికాయలు తినడం, ఆ తరువాత మళ్ళీ మరో సెక్షన్ క్రింద కేసు నమోదుచేయడం, వారి అత్యుత్సాహానికి నిదర్శనంగా నిలుస్తోంది.

 

తెలుగుదేశంపార్టీ అధికార ప్రతినిది రేవంత్ రెడ్డి ఈ రోజు మద్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ పోలీసుల ఈ అత్యుసాహానికి కారకులెవరు అని ప్రశ్నిస్తూ, అసలు ఎవరిపైనా హత్యాప్రయత్నం జరిగిందని పోలీసులు కేసులు నమోదు చేసేరో, ఆ వ్యక్తి అనగా సుధాకర్ రెడ్డి స్వయంగా తనకు పరిటాల కుటుంబముతో ఏ వ్యక్తిగత కక్షలు, గొడవలులేవని మీడియా ముందే చెప్పినపుడు, మరి ఏ ఉద్దేశ్యంతో ఈ విధంగా పరిటాల తనయుడు శ్రీరామ్ పై పోలీసులు కేసు నమోదు చేసారని ప్రశ్నించారు.

 

అంతేగాకుండా, తమ పార్టీకి చెందిన మహిళా శాసనసభ్యురాలయిన పరిటాల సునీత ఇంటిని అర్ధరాత్రి పోలీసులు సోదాలు చేయడంపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ కి లిఖితపూర్వక పిర్యాదు చేయడం, ఆయన వెంటనే స్పందిస్తూ 48గంటల్లో తనకు నివేదికను సమర్పించమని అనంతపురం జిల్లా యస్.పీ.ని ఆదేశించడంతో పోలీసులు తత్తరపడుతూ తమ తప్పు కప్పిపుచ్చుకొనేందుకు తిప్పలు పడుతున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు కేసు ఒక కొత్త మలుపుతిరిగింది.

 

ఇంతవరకూ పరిటాల కుటుంబముతో తనకు ఏ వ్యక్తిగత కక్షలు, గొడవలు లేవని మీడియా ముందే చెప్పిన సుధాకర్ రెడ్డి, మాటమార్చి పరిటాల సునీత తమ్ముడు బాలాజీ ఇదివరకు ఒకసారి తనపై హత్యా ప్రయత్నం చేసాడని, మళ్ళీ ఇప్పుడు జరిగిన హత్యప్రయత్నంతో తనకూ, తన కుటుంబానికి కూడా ప్రాణభయం ఏర్పడిందని, అందువల్ల తనకు, తన కుటుంబానికి పోలీసు రక్షణ కలిపించమని సుధాకర్ రెడ్డి ఈ రోజు ధర్మవరం పోలీసులను కోరారు.

 

అసలు తాను పరిటాల శ్రీరామ్ పై ఫిర్యాదు చేయలేదని సుధాకరరెడ్డి ప్రకటించారు. తనను ఎవరు టార్గెట్ చేశారో పోలీసులే తేల్చాలని చెప్పిన సుధాకర్ రెడ్డి ఇంత ఆకస్మాతుగా మాట ఎందుకు మార్చేడు? ఆవిధంగా పలికేందుకు అతనిపై ఎవరెవరు ఒత్తిడి తెచ్చేరు? ఎందుకు ఒత్తిడి తెచ్చేరు? అనే కొత్త ప్రశ్నలు పుట్టుకొచ్చి ఈ కుట్ర వెనుక ఎవరో కొందరు రాజకీయ పెద్దల ప్రమేయం ఉండి ఉండవచ్చునని సూచిస్తోంది.