ఏపీలో పంచాయితీ ఎన్నికలు.. టీడీపీకి లాభమేనా?

 

పంచాయితీ ఎన్నికల చర్చ మళ్ళీ తెరమీదకు వచ్చింది. పంచాయితీ సర్పంచ్‌ల గడువు ముగియడంతో ప్రత్యేక అధికారులను రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నియమించాయి. దీనిపై రెండు రాష్ట్రాలకు చెందిన నాయకులు హైకోర్టులో రిట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. పంచాయితీల్లో ప్రత్యేకాధికారుల నియామకం చెల్లదని, మూడు నెలలోపు పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాలని తాజాగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇదే తీర్పు ఏపీకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని కొందరు, అసెంబ్లీ ఎన్నికల తరువాత నిర్వహించాలని మరి కొందరు చంద్రబాబును కోరగా.. ఆయన అసెంబ్లీ ఎన్నికలు తరువాత జరిపించాలని భావించి ప్రత్యేకాధికారులను నియమించారు.

హైకోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలమా..? ప్రతికూలమా..?అనేది పక్కన పెడితే..ఇదే తీర్పు ఏపీకి వర్తింప చేస్తే టీడీపీకి అనుకూలం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీకి కులాలు, వర్గాలతో సంబంధం లేకుండా గ్రామస్థాయి నుండి అన్ని వర్గాల వారిలో సానుకూలం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడా లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడుతూ సామాన్యుడికి మరింత దగ్గరైంది. ఇలాంటి సమయంలో పంచాయితీ ఎన్నికలు జరిగితే టీడీపీకి ఖచ్చితంగా కలిసొస్తుంది. కానీ, ఎక్కడ తమ నెత్తిన ఆర్థిక భారం పడుతుందోనన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒక పథకం ప్రకారం పంచాయితీ ఎన్నికలు జరగకుండా చంద్రబాబును తప్పుదోవపట్టించారనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో ఉంది. తెలంగాణలో పంచాయితీ ఎన్నికలు మూడు నెలల్లో జరపాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో అదే తీర్పు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల్లో పంచాయితీ ఎన్నికలు జరిగే అవకాశాన్ని తోసిపుచ్చలేం. అప్పటి వరకు ప్రత్యేకాధికారుల పాలన ఉంటుందని హైకోర్టు చెప్పవచ్చు. ఇదే జరిగితే పంచాయితీ ఎన్నికలకు సీఎం చంద్రబాబు ఒప్పుకోక తప్పదు.