రాజకీయ పార్టీల పంచాయితీ హడావుడి

 

చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలంటారు పెద్దలు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు కూడా అదే పనిలో ఉన్నాయి. పార్టీలకతీతంగా గ్రామస్థాయిలో జరగనున్నపంచాయితీ ఎన్నికలను, అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు కోసం ప్రణాళికలు రచించడం మొదలుపెట్టాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన బంగారు తల్లిని నమ్ముకొని ఒంటరిగా ముందుకు దూసుకుపోతుంటే, తెరాస తెలంగాణావాదాన్ని, వైకాపా వైయస్సార్ సెంటిమెంటులని నమ్ముకొని బరిలోకి దిగుతున్నాయి.

 

క, ఏ వాదము, సెంటిమెంటు లేని ప్రతిపక్ష పార్టీ తెదేపా మాత్రం తన క్యాడర్లని నమ్ముకొని ఈ ఎన్నికలలో విజయం సాదించాలని భావిస్తోంది. మిగిలిన రెండు పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్, తెదేపాలకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి బలమయిన క్యాడర్లు ఉన్నందున, అవి ప్రజలలోకి తేలికగా చొచ్చుకొని వెళ్ళగలుగుతున్నాయి.

 

అయితే, కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి ఒంటెత్తు పోకడలవల్ల, వివిధ ప్రాంతాలలో స్థానిక కాంగ్రెస్ నేతల అనుచరుల నుండి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. అయినప్పటికీ, తన స్వంత చరిష్మాతోనే పార్టీకి విజయం సాధించిపెట్టి, తన వ్యక్తిగత ఇమేజ్ ను మరింత పెంచుకోవాలని ఆలోచనతో కిరణ్ కుమార్, అందుకు తగినట్లుగానే ప్రణాళికలు సిద్దం చేసుకొంటున్నారు.

 

ఇక, తెదేపా కూడా ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు కోసం తన సర్వ శక్తులు ఒడ్డి పోరాడేందుకు సిద్దం అవుతోంది. అందుకోసం చంద్రబాబు త్వరలో హైదరాబాద్, వరంగల్, తిరుపతి, వైజాగ్ మరియు గుంటూరు జిల్లాలో పార్టీ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి వారికి శిక్షణా తరగతులు నిర్వహించాలని అనుకొంటున్నారు. అదేవిధంగా, పార్టీలోని సీనియర్ నేతలను వారి వారి జిల్లాలలో పర్యటింపజేయడం ద్వారా పార్టీ శ్రేణులను ఉత్సాహపరచవచ్చని భావిస్తున్నారు. పంచాయితీ ఎన్నికల షెడ్యుల్ విడుదల అయిన తరువాత ఆయన తిరిగి తన బస్సు యాత్రని కూడా మొదలుపెట్టీ ఆలోచనలో ఉన్నారు. తద్వారా ఎన్నికల సమయం నాటికి వీలయినన్ని ఎక్కువ గ్రామాలు సందర్శించి, స్థానిక కార్యకర్తలను, ప్రజలను కూడా ప్రభావితం చేయవచ్చునని ఆయన అభిప్రాయం.

 

వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా ఇప్పటికే చాల ప్రాంతాలలో పార్టీ కార్యకర్తలు మరియు నేతలతో సమావేశాలులు నిర్వహిస్తున్నారు. కానీ, పార్టీ నుండి పెరిగిన వలసలు, అంతర్గత విబేధాలతో సతమతమవుతున్న ఆ పార్టీ తెలంగాణా ప్రాంతంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇక తెరాస నేతలపై ఇటీవల వచ్చిన ఆరోపణలతో ఆ పార్టీ కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో, ఎలాగయినా తెదేపాను గెలిపించుకోవాలని చంద్రబాబు ఆశిస్తున్నారు,